మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఆయుధాలతో సహా లొంగిపోయిన 25 మంది మావోలు
- ఝార్ఖండ్ డీజీపీ సమక్షంలో లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు
- లైట్ మెషీన్ గన్స్ సహా పలు రకాల ఆయుధాల అప్పగింత
- అందరికీ పూర్తి పునరావాసం కల్పిస్తామన్న డీజీపీ
ఝార్ఖండ్‌లో మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని మరో దెబ్బ తగిలింది. 25 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర డీజీపీ సమక్షంలో వీరు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు సబ్ జోనల్ కమాండర్లు, మరో ఆరుగురు ఏరియా కమాండర్లు, 13 మంది చురుకైన హార్డ్‌కోర్ సభ్యులు ఉన్నారు. వీరంతా సుదీర్ఘకాలంగా ఝార్ఖండ్‌లోని అత్యంత క్లిష్టమైన కోలహాన్, దట్టమైన సరంద అటవీ ప్రాంతాలలో తమ సాయుధ కార్యకలాపాలను నిర్వహిస్తూ భద్రతా దళాలకు సవాలుగా మారారు.
ఈ లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు భారీగా ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇందులో ఎల్‌ఎమ్‌జీ, ఇన్సాస్ రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్ లు, 303 రైఫిళ్లు, దేశవాళీ తుపాకులు ఉన్నాయి. లొంగిపోయిన వారిలో మహిళా మావోయిస్టులు కూడా ఉండటం గమనార్హం. 100కు పైగా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండి, సుదీర్ఘకాలంగా మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న టాప్ కమాండర్ సాగెన్ అంగారియా అలియాస్ డొకోల్ కూడా లొంగిపోయిన వారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంతటి కీలక నేతలు, కేడర్ ఒకేసారి ప్రధాన స్రవంతిలోకి రావడంతో ఝార్ఖండ్‌లో మావోయిస్టు పార్టీ నెట్‌వర్క్ పూర్తిగా బలహీనపడినట్లయింది.
ఈ సందర్భంగా ఝార్ఖండ్ డీజీపీ మాట్లాడుతూ... రాష్ట్రంలో తీవ్రవాదాన్ని, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు భద్రతా దళాలు సమష్టిగా, వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయని కొనియాడారు. హింసను వీడి వచ్చిన వీరందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తామని, సమాజంలో గౌరవప్రదంగా బతికేందుకు తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఇంకా అడవుల్లో అజ్ఞాతంలో కొనసాగుతున్న మిగిలిన మావోయిస్టులు కూడా తక్షణమే హింసా మార్గాన్ని విడనాడి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వాడుకుంటూ ప్రధాన స్రవంతిలోకి రావాలని సీఆర్పీఎఫ్ ఐజీ సాకేత్ సింగ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.