'మావిగన్'ను ప్రతిపాదించింది అందుకే: జగన్

  • స్కాముల కోసమే చంద్రబాబు అమరావతి అంటున్నారన్న జగన్
  • కేసీఆర్ రూ. 615 కోట్లతో అత్యాధునిక సచివాలయాన్ని కట్టారని ప్రశంస
  • 'మావిగన్'కు రాష్ట్ర ప్రజలు మద్దతు పలికారని వ్యాఖ్య

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న పెద్ద దురదృష్టమని వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో కూడా ఏపీకి రాజధాని లేకుండా పోయే ప్రమాదం ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాము ప్రతిపాదించిన 'మావిగన్' పేరు ఎత్తితేనే చంద్రబాబుకు గుండె ఆగిపోయేలా ఉందని, భయంతో మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారని జగన్ విమర్శించారు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా... సున్నా నుంచి ప్రారంభించాల్సిన అమరావతి కంటే, ఇప్పటికే అన్ని సదుపాయాలు ఉన్న 'మావిగన్' ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా చూపించామని జగన్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ ప్రతిపాదనకు మద్దతు పలికారని, ఆ వాస్తవాన్ని తట్టుకోలేకనే చంద్రబాబు తనపై, వైసీపీపై బురద జల్లుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.


అమరావతిలో కేవలం రోడ్లు, నీరు, డ్రైనేజీ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలకే రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని.. రాజధాని నిర్మాణం ఆచరణ సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు కేవలం స్కామ్‌ల కోసమే ముందుకు వెళుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే అమరావతి పేరుతో రూ. 47,387 కోట్లు అప్పు చేశారని, ఖజానా నుంచి మరో రూ. 9,200 కోట్లు ఖర్చు చేస్తూ రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారని మండిపడ్డారు.


అమరావతిలో ఇప్పటికే రూ. 1,200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ తాత్కాలిక భవనాలు ఉన్నప్పటికీ, మళ్లీ కొత్తగా కడతామనడం విచ్చలవిడి దోపిడీకి నిదర్శనమన్నారు. కొత్తగా నిర్మించ తలపెట్టిన 5 బిల్డింగ్‌ల అంచనాలను జగన్ ప్రశ్నించారు. ఈ ఐదు బిల్డింగుల డిజైన్లకే రూ. 401 కోట్లు తగలేశారని, మొత్తం నిర్మాణ ఖర్చు రూ. 10,665 కోట్లుగా చూపించారని లెక్కలు కట్టారు.


"ప్రస్తుత అంచనాల ప్రకారం చదరపు అడుగుకు నిర్మాణ వ్యయం రూ. 20,427 అవుతోంది. దీనికి ఫర్నీచర్, ఇంటీరియర్ ఖర్చులు కూడా కలిపితే చదరపు అడుగుకు రూ. 30 వేలు దాటుతుంది. ఫైవ్‌స్టార్ హోటళ్ల నిర్మాణానికే చదరపు అడుగుకు రూ. 4,500 లోపు ఖర్చవుతుంటే, ఇక్కడ ఇంత భారీ ఖర్చు దేనికి?" అని జగన్ నిలదీశారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ కేవలం రూ. 615 కోట్లతోనే అత్యంత ఆధునిక సచివాలయాన్ని నిర్మించారని, కానీ ఏపీలో మాత్రం కొత్త టెండర్ల పేరుతో పాత కాంట్రాక్టర్లకే పనులు ఇస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.




Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh
Mavigan
Amaravati
AP Capital
YSRCP
Political News
AP Politics
Corruption

More Telugu News