రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌కు కష్టమేనా?

  • రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ వర్గాల్లో ఆందోళన
  • ఆఫ్ఘన్‌ సిరీస్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగానే ఎంపిక
  • 40 ఏళ్లకు దగ్గరవుతుండటంతో పెరుగుతున్న గాయాల భయాలు
  • ఫిట్‌నెస్‌లో కోహ్లీతో రోహిత్‌ను పోల్చలేమంటున్న వర్గాలు
  • వరల్డ్ కప్ కోసం అదనపు ఓపెనర్ల వేటలో సెలక్టర్లు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ నాటికి రోహిత్ వన్డే ఫార్మాట్‌కు సరిపోయేలా ఫిట్‌గా ఉంటారా? లేదా? అనే అనుమానాలు ఉన్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేసినా ఆయన ఆడటం మాత్రం పూర్తిగా ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అవడంపైనే ఆధారపడి ఉంటుందని చర్చ జరుగుతోంది.

50 ఓవర్లు ఆడగలడా?
ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2026 మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో రోహిత్ గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వయసు 40 ఏళ్లకు దగ్గరపడుతుండటంతో గాయాల నుంచి కోలుకోవడానికి శరీరం ఎక్కువ సమయం తీసుకుంటుందని బోర్డు వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌లో ఉన్నట్లు వన్డేల్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఉండదని, మైదానంలో 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయడం రోహిత్ శరీరానికి భారంగా మారే అవకాశం ఉందని సెలక్టర్లు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.

కోహ్లీతో పోలిక వద్దు
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఇకపై ఒకేలా చూడలేమని బీసీసీఐ వర్గాలు అంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం కోహ్లీ ఫిట్‌నెస్, ఫామ్ మిగతా క్రికెటర్ల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయని సమాచారం. మరోవైపు రోహిత్ శర్మ గతంలోలా దూకుడుగా ఆడకపోవడంపై కూడా టీమ్ మేనేజ్‌మెంట్ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే రోహిత్ విషయంలో బీసీసీఐ మెడికల్ టీమ్‌తో చర్చించి ఒక గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.

ప్రత్యామ్నాయ ఓపెనర్ల వేట
రోహిత్ శర్మ భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో సెలక్టర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌తో పాటు మరో బ్యాకప్ ఓపనర్‌ను సిద్ధం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇషాన్ కిషన్‌ను కూడా ఓపనర్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వరల్డ్ కప్ నాటికి కీలక ఓపెనర్లు ఎవరైనా గాయపడితే ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో బోర్డు ముందే అప్రమత్తమైనట్లు క్రికెట్ వర్గాలు చెబున్నాయి.

Rohit Sharma
BCCI
fitness concerns
world cup 2027
Indian cricket team
Virat Kohli
Yashasvi Jaiswal
Shubman Gill
Ishan Kishan
injury concerns

More Telugu News