తిరుమల కొండల్లో పచ్చదనం.. అటవీ సంరక్షణలో దేశానికే ఆదర్శంగా టీటీడీ

  • శేషాచల కొండల్లో 89.40 శాతానికి చేరిన పచ్చదనం
  • అటవీ సంరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన టీటీడీ
  • అక్రమ నరికివేత, వేట నివారణకు 24 గంటల పటిష్ట నిఘా
  • వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యంపై ప్రత్యేక దృష్టి
  • విదేశీ మొక్కల స్థానంలో గంధం, ఎర్రచందనం పెంపకం
తిరుమల పుణ్యక్షేత్రం అనగానే శ్రీవారి దివ్యమంగళ స్వరూపంతో పాటు పచ్చని గిరులు కళ్లముందుకొస్తాయి. ఆ పవిత్ర శేషాచల కొండలు ఇప్పుడు పచ్చదనంతో మరింత కళకళలాడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అటవీ విభాగం దశాబ్దాలుగా చేస్తున్న కృషితో ఈ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం ఏకంగా 89.40 శాతానికి చేరింది. ఇటీవల విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక (ఐఎస్ఎఫ్ఆర్‌) ప్రకారం అటవీ సంరక్షణలో టీటీడీ దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచింది. టీటీడీ పరిధిలోని 2,719 హెక్టార్ల అటవీ ప్రాంతంలో దాదాపు 2,431 హెక్టార్లు పచ్చదనంతో నిండి ఉండటం విశేషం.

1980 నుంచి టీటీడీ అటవీ విభాగం శేషాచల అరణ్య సంపద పరిరక్షణకు, పర్యావరణ సమతుల్యతకు పెద్దపీట వేస్తోంది. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పర్యవేక్షణలో తిరుమల, తిరుపతిలలో రెండేసి చొప్పున మొత్తం నాలుగు ఫారెస్ట్ రేంజ్‌ల ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు 24 గంటల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. అగ్నిప్రమాదాల నివారణకు ఏటా 26.5 లక్షల చదరపు మీటర్ల ఫైర్ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక బృందాలతో అప్రమత్తంగా ఉంటున్నారు.

జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా టీటీడీ ఓ కీలక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పర్యావరణానికి హాని కలిగించే విదేశీ జాతి అకేషియా చెట్లను తొలగించి, వాటి స్థానంలో 576 హెక్టార్ల విస్తీర్ణంలో గంధం, ఎర్రచందనం, ఉసిరి, నేరేడు వంటి స్థానిక జాతి మొక్కలను నాటుతున్నారు. ఇప్పటికే 22 హెక్టార్లలో ఈ పనులు పూర్తయ్యాయి. దీనికి అవసరమైన మొక్కలను టీటీడీయే తన నర్సరీలలో పెంచుతోంది.

టీటీడీ కృషితో పచ్చని వనమైన శేషాచలం
మానవ-వన్యప్రాణి ఘర్షణల నివారణకు, జంతువుల సంరక్షణకు కూడా టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది. వేసవిలో జంతువుల దాహార్తి తీర్చేందుకు నీటి గుంతలు ఏర్పాటు చేయడం, భక్తుల భద్రత కోసం స్నేక్ రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ అవసరాలకు శ్రీగంధం, వంటచెరకు, దర్భ వంటివి సమకూర్చడంతో పాటు, తిరుమల-తిరుపతిలలో రహదారి డివైడర్లు, ఉద్యానవనాల సంరక్షణ బాధ్యతలను కూడా అటవీ విభాగమే చూసుకుంటోంది. ప్రస్తుతం పవిత్ర వనం, దివ్య ఔషధ వనం వంటి పలు ప్రాజెక్టులతో శేషాచల పచ్చదనాన్ని మరింత పెంచేందుకు టీటీడీ కృషి చేస్తోంది.

TTD
Tirumala
Forest conservation
Seshachalam hills
India State of Forest Report
Forestry
Wildlife protection
Aforestation
Environmental protection
Tirupati

More Telugu News