నా వ్యాఖ్యలను వక్రీకరించారు: జస్టిస్ సూర్యకాంత్

  • నకిలీ, బోగస్ డిగ్రీలతో వృత్తిలోకి ప్రవేశించే వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు వెల్లడి
  • కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన
  • భారత యువత పట్ల తాను గర్వపడుతున్నానన్న జస్టిస్ సూర్యకాంత్
కొంతమందిని తాను పరాన్నజీవులుగా లేదా బొద్దింకలుగా పోల్చిన వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించారు. ఒక కేసు విచారణ సందర్భంగా మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన వివరణ ఇచ్చారు. నకిలీ, బోగస్ డిగ్రీలతో ఈ వృత్తిలోకి వచ్చేవారిని ఉద్దేశిస్తూ తాను ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు. ఇలాంటి వారే మీడియా, సోషల్ మీడియాతో పాటు ఇతర రంగాల్లోకి చొరబడ్డారని అన్నారు. అందుకే అలాంటి వారిని పరాన్నజీవులుగా పేర్కొన్నట్లు తెలిపారు. కానీ మీడియాలో కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

భారతీయ యువత పట్ల తాను ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు. నిన్న ఓ కేసు విచారణ సందర్భంగా మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం వక్రీకరించిన తీరును చదివి తాను ఆవేదన చెందానని పేర్కొన్నారు.  

మన దేశ యువతను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారమని అన్నారు. మన దేశ యువతను చూసి ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు. తన పట్ల వారికి గౌరవ మర్యాదలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అన్నారు. యువతను దేశాభివృద్దికి మూలస్తంభాలుగానే చూస్తానని సూర్యకాంత్ తెలిపారు.

Justice Surya Kant
Surya Kant
Chief Justice of India
Fake degrees
Bogus degrees
Lawyers
Indian youth

More Telugu News