ప్రజలకూ ఏఐ బూమ్‌ లాభాలు.. తైవాన్‌లో ప్రతి పౌరుడికి రూ.30 వేల నగదు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రజలకూ ఏఐ బూమ్‌ లాభాలు.. తైవాన్‌లో ప్రతి పౌరుడికి రూ.30 వేల నగదు!

  • సెమీకండక్టర్లు, హై-పర్‌ఫార్మెన్స్ కంప్యూటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌
  • దీంతో చిప్‌ తయారీలో ముందున్న తైవాన్‌ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊపు
  • వృద్ధి ఫలాలను ప్రజలతో పంచుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం
  • ఫిబ్రవరిలో లూనార్ న్యూ ఇయర్‌కు ముందే నగదు పంపిణీకి ప్రణాళికలు
  • ఈ నగదును తమకు అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చన్న అధ్యక్షుడు లై
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగం దూసుకుపోతుండటంతో తైవాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊపు వచ్చింది. ఈ వృద్ధి ఫలాలను ప్రజలతోనూ పంచుకోవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి 10 వేల తైవాన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.30 వేలు) నగదు అందించే ప్రతిపాదనను అధ్యక్షుడు లై చింగ్-తే ముందుకు తీసుకొచ్చారు. దీనిని ఆయన ‘ఏఐ డివిడెండ్’గా అభివర్ణించారు.

ఏఐ, అధునాతన సెమీకండక్టర్లు, హై-పర్‌ఫార్మెన్స్ కంప్యూటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్‌తో తైవాన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. 2026 తొలి ఆరు నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థ 14.15 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది మొత్తం వృద్ధి అంచనాను ప్రభుత్వం 11.05 శాతానికి పెంచింది.

కొత్త అప్పులు లేకుండానే..
ఈ నగదు పంపిణీ కోసం కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఏఐ, టెక్నాలజీ రంగాల వృద్ధితో పెరిగిన ప్రభుత్వ ఆదాయాన్ని ఇందుకు వినియోగించనున్నారు. 2027 కేంద్ర బడ్జెట్‌కు ఈ ఏడాది చివర్లో శాసనసభ ఆమోదం లభిస్తే, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లూనార్ న్యూ ఇయర్‌కు ముందే నగదు పంపిణీ చేసే అవకాశం ఉంది.

ప్రజలు ఈ నగదును తమకు అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చని అధ్యక్షుడు లై తెలిపారు. విద్య, వృద్ధుల సంరక్షణ, కుటుంబ అవసరాలు లేదా షాపింగ్‌కు ఖర్చు చేసుకోవచ్చని సూచించారు.

40 ఏళ్లలో అత్యధిక వృద్ధి
ప్రపంచ ఏఐ బూమ్‌కు తైవాన్ అతిపెద్ద లబ్ధిదారుల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా అధునాతన చిప్స్, ఏఐ సర్వర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ పరికరాల సరఫరాలో తైవాన్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుత అంచనా ప్రకారం 11.05 శాతం వృద్ధి నమోదైతే దాదాపు నాలుగు దశాబ్దాల్లో తైవాన్‌కు ఇదే అత్యధిక ఆర్థిక వృద్ధి కానుంది.

అయితే ఈ నిర్ణయంపై రాజకీయ విమర్శలూ వస్తున్నాయి. గతంలో ఇలాంటి నగదు పంపిణీ పథకాలను వ్యతిరేకించిన అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఇప్పుడు ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాల కోసం తన వైఖరి మార్చుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఏఐ ఆధారిత ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు కొన్ని రంగాలకే పరిమితం కాకుండా సాధారణ ప్రజలకు కూడా చేరాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధ్యక్షుడు లై స్పష్టం చేశారు.
Advertisement

More Telugu News