అలర్ట్ అలర్ట్... ఈ నెల 20న మెడికల్ షాపులు బంద్!

  • 12.4 లక్షలకు పైగా మెడికల్ దుకాణాలు బంద్
  • కార్పొరేట్ కంపెనీలు ఆన్‌లైన్‌లో డిస్కౌంట్లకు ఇవ్వడంపై ఆందోళన
  • ధరల నియంత్రణ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆందోళన
దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన 12.4 లక్షలకు పైగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. ఆలిండియా అర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. కార్పొరేట్ కంపెనీల అండదండలతో నడుస్తున్న ఆన్‌లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ సంప్రదాయ మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయంటూ కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫార్మసీ కంపెనీలు ఈ పోటీని తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు చెబుతున్నారు.

అనియంత్రిత ఆన్‌లైన్ అమ్మకాలు, ఈ-ఫార్మసీ డిస్కౌంట్‌కు వ్యతిరేకంగా ఏఐఓసీడీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కారణంగా సాధారణ మందుల కొనుగోలు ఒకరోజు పాటు తీవ్రంగా ప్రభావితం కానుంది. ఆసుపత్రులకు అనుగుణంగా ఉన్న ఎమర్జెన్సీ ఫార్మసీలు మాత్రం తెరిచి ఉండే అవకాశం ఉంది. 20న బంద్ నేపథ్యంలో అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేయాలని ఏఐఓసీడీ సూచించింది. ఈ బంద్‌లో కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొననున్నారు.

ఆన్‌లైన్ పార్మసీని నియంత్రించాలని ఏఐఓసీడీ డిమాండ్ చేస్తోంది. ఆన్‌లైన్ కంపెనీలు తక్కువ ధరలకు మందులు విక్రయించడం వల్ల స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. డాక్టర్ ప్రిస్కిప్షన్‌లు దుర్వినియోగం అవడమే కాకుండా, ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని పేర్కొంది.

కార్పొరేట్ సెక్టార్లు ఇస్తున్న డిస్కౌంట్లను నియంత్రించాలని, ధరల నియంత్రణ విషయంలో నిబంధనలు పాటించకుండా నేషనల్ ప్రైస్ అథారిటీ ప్రకారం విక్రయాలు జరగాలని డిమాండ్ చేసింది. కొవిడ్ సమయంలో పేషెంట్లకు మందులు డోర్ డెలివరి చేశారని, ఈ సౌకర్యాన్ని నిలిపివేయాలని కోరింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్ళినప్పటికీ, సరైన చర్యలు తీసుకోలేదని ఏఐఓసీడీ పేర్కొంది.

అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలిగించకుండా, బంద్‌లో శాంతియుతంగా, చట్టబద్ధంగా పాల్గొనాలని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు అన్నారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, నిజమైన అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఎమర్జెన్సీ మందులను సరఫరా చేయాలని అన్నారు. రోగులు, ప్రజలు, అధికారులు లేదా ఏజెన్సీలతో ఎటువంటి ఘర్షణకు దిగవద్దని కోరారు. అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని కోరారు. బంద్ సమయంలో బలవంతపు మూసివేతలు, బెదిరింపులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నివారించాలని పోలీసు శాఖను కోరారు. అంబులెన్సులు, అత్యవసర మందుల సరఫరా వాహనాలు, ఆరోగ్య సిబ్బంది సులభంగా రాకపోకలు సాగించేలా చూడాలని కోరారు.

Medical Shop Bandh
All India Organisation of Chemists and Druggists
AIOCD
Online Pharmacies

More Telugu News