నాడు కియా.. నేడు స్టెల్త్ ఫైటర్ జెట్.. అనంతకు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్: మంత్రి లోకేశ్‌

  • పుట్టపర్తిలో ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చే ప్రాజెక్టు అని మంత్రి లోకేశ్‌ వ్యాఖ్య
  • నాడు కియా కార్లు, నేడు ఫైటర్ జెట్లు చంద్రబాబు వల్లేనని వెల్లడి
  • వాళ్లది ఫ్యాక్షన్, మనది ఫైటర్ జెట్ అంటూ విపక్షాలపై చురకలు
  • ఈ ప్రాజెక్టుతో రాయలసీమ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు
ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను మార్చే బృహత్తర ఘట్టానికి పుట్టపర్తిలో అంకురార్పణ జరిగిందని, ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) ప్రాజెక్టుతో ఈ ప్రాంతం భారతదేశ రక్షణ రంగంలో కొత్త శక్తి కేంద్రంగా మారబోతోందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. పుట్టపర్తిలో ఏఎంసీఏ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ద్వారా రానున్న పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా 14కి 14 స్థానాల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించిందని, దానికి రిటర్న్ గిఫ్ట్‌గా ఈ ప్రాజెక్టును అందిస్తున్నామని లోకేశ్‌ పేర్కొన్నారు. "నాడు కరవు నేలపై కియా కార్లు పరిగెత్తించిన విజనరీ చంద్రబాబు. నేడు అదే పుణ్యభూమిపై ఫైటర్ జెట్లు ఎగిరేలా చేస్తున్నది కూడా ఆయనే. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనిస్తోంది" అని ఆయన అన్నారు.

నమో జోడితోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు 
ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడుల 'నమో జోడి' వల్లే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని లోకేశ్‌ తెలిపారు. "రూ.1.35 లక్షల కోట్ల గూగుల్ డేటా సెంటర్, రూ.1.35 లక్షల కోట్ల ఆర్సెలార్ మిట్టల్ పెట్టుబడులతో పాటు ఇప్పుడు పుట్టపర్తిలో లక్ష కోట్ల ఏఎంసీఏ ప్రాజెక్టు వచ్చింది. పోలవరం, అమరావతికి నిధులు, విశాఖ ఉక్కు పరిరక్షణ, విశాఖ రైల్వే జోన్, కర్నూలుకు హైకోర్టు బెంచ్ వంటివన్నీ ఈ పవర్‌ఫుల్ కాంబినేషన్‌తోనే సాధ్యమయ్యాయి" అని వివరించారు. ఏపీలో ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్ కాదని, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని ఆయన అభివర్ణించారు.

యువతకు ఉపాధి.. అభివృద్ధిలో నెం.1 
డీఆర్‌డీఓ, ఏడీఏ, హాల్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టుతో 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను ఇక్కడ తయారు చేస్తారని లోకేశ్‌ తెలిపారు. భారత్ ఫోర్జ్, భారత్ డైనమిక్స్ వంటి అనేక దిగ్గజ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టనున్నాయని, తద్వారా ఈ ప్రాంత యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. "ఒక్క కియా పరిశ్రమతోనే అనంతపురం ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏఎంసీఏ ప్రాజెక్టుతో ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిలో నంబర్ వన్ కావడం ఖాయం" అని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం సీఎం చంద్రబాబు, పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా కృషి చేశారని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో చురకలంటించిన లోకేశ్‌, "వాళ్లది ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్, మనది ఫైటర్ జెట్ బ్యాక్‌గ్రౌండ్. వాళ్లది కిడ్నాప్ బ్యాక్‌గ్రౌండ్, మనది కియా బ్యాక్‌గ్రౌండ్. రెండిటికీ చాలా తేడా ఉంది. అర్థమైందా రాజా?" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రానికి ఈ ప్రాజెక్టును కేటాయించినందుకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Nara Lokesh
AMCA Project
Puttaparthi
Chandrababu Naidu
Fighter Jet Project
Anantapur
Rajnath Singh
AP Development
Defense Sector

More Telugu News