ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court on Election Commissioners Appointment Process
  • ఎంపిక కమిటీలో కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చడంపై ప్రశ్న
  • సీబీఐ డైరెక్టర్ నియామక ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారన్న జస్టిస్ దీపాంకర్ దత్తా
  • ఈసీ కమిషనర్ల నియామక ప్రక్రియలో స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదని ప్రశ్న
ఎన్నికల కమిషనర్ల చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీలో కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చడం వెనుక ఉన్న హేతుబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు ప్రశ్నించింది. నియామక ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, క్యాబినెట్ మంత్రితో కూడిన ప్యానెల్ ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామకంపై నిర్ణయం తీసుకుంటుంది.

నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక ప్రశ్నలు సంధించారు. సీబీఐ డైరెక్టర్ నియామక ప్యానెల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉంటున్నారని, ఎన్నికల సంఘం విషయంలో అలా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. కనీసం స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించారు.

ప్రధానమంత్రి ఒక వ్యక్తిని నియమిస్తే, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు మరొకరిని నియమిస్తారని, అలాంటి సందర్బాలలో కేబినెట్ మంత్రిగా ఉన్నవారు ప్రతిపక్ష నాయకుడికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఆచరణలో అన్ని సందర్భాలలో అలా జరగకపోవచ్చని అటార్నీ జనరల్ సమాధానం ఇచ్చారు.

ప్రధాని నిర్ణయాన్ని కేబినెట్ మంత్రి వ్యతిరేకించరని, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఒక్కరే అవుతారని, దీంతో 2:1తో ప్రధాని సూచించిన వారు నియమించబడతారని జస్టిస్ దీపాంకర్ అన్నారు. ప్రతిపక్ష నాయకుడి పాత్ర కేవలం అలంకారప్రాయమే అని అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తున్నట్లు ప్రజలు భావించాలని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
Go Back to Shorts
Supreme Court of India
Election Commissioner Appointment
Chief Election Commissioner
Election Commission

More Telugu News