దేశంలోనే తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం

Telangana Records Highest Inflation Rate in India
  • తెలంగాణలో 5.81 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం
  • దేశవ్యాప్తంగా 13 నెలల గరిష్ఠానికి చేరిన ధరల సూచీ
  • ఆహార పదార్థాలు, బంగారం, వెండి ధరలు పెరగడమే ప్రధాన కారణం
  • ఆంధ్రప్రదేశ్‌లో 4.2 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం
  • గత ఆరు నెలలుగా వరుసగా పెరుగుతున్న ధరలు
ఏప్రిల్ నెలలో ఎండలతో పాటు ధరలు కూడా భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా ధరలు పెరిగినా, ఆ సెగ తెలంగాణకు ఎక్కువగా తగిలింది. దేశంలోనే అత్యధికంగా 5.81 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలోనే నమోదైంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇది 4.2 శాతంగా ఉంది. మంగళవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.

దేశవ్యాప్తంగా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.48 శాతానికి చేరింది. ఇది గత 13 నెలల్లోనే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. గత ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం వరుసగా పెరుగుతూ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మార్చిలో 3.40 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, నెల రోజుల వ్యవధిలోనే గణనీయంగా పెరిగింది.

కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలతో పాటు బంగారం, వెండి ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం మార్చిలో 3.87 శాతం ఉండగా, ఏప్రిల్‌లో 4.20 శాతానికి పెరిగింది. ముఖ్యంగా టమాటా (35.28%), కాలీఫ్లవర్ (25.58%), కొబ్బరి (44.55%) ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు, బంగారం, వజ్రాభరణాల ధరలు 40.72 శాతం పెరగగా, వెండి ఆభరణాల ధరలు ఏకంగా 144.34 శాతం పెరిగాయి. అయితే బంగాళదుంపలు, ఉల్లిపాయల వంటి కొన్నింటి ధరలు తగ్గాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మిజోరాంలో అత్యల్పంగా 0.69 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.
Go Back to Shorts
Telangana
Telangana Inflation
Retail Inflation
India Inflation
Consumer Price Index
CPI
Price Hike
Vegetable Prices
Gold Price
Silver Price

More Telugu News