ఏఐఏడీఎంకేలో తీవ్ర సంక్షోభం..విజయ్ పార్టీకి మద్దతివ్వనున్న షణ్ముగం వర్గం?

AIADMK in Crisis Shanmugam Faction to Support Vijay Party
  • ఎన్నికల ఓటమి తర్వాత ఏఐఏడీఎంకేలో మొదలైన వర్గపోరు
  • శాసనసభాపక్ష నేత పదవి కోసం రెండుగా చీలిన ఎమ్మెల్యేలు
  • పళనిస్వామికి 17, వేలుమణికి 30 మంది ఎమ్మెల్యేల మద్దతు
  • విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే యోచనలో అసమ్మతి వర్గం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే) పార్టీ మరో చీలిక దిశగా పయనిస్తోంది. పార్టీ శాసనసభాపక్ష నేత పదవి కోసం రెండు వర్గాలు తీవ్రంగా పోటీ పడుతుండటంతో అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరింది.

మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా మాజీ మంత్రి సీవీ షణ్ముగం వర్గం పావులు కదుపుతోంది. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఎస్పీ వేలుమణిని శాసనసభాపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ ప్రొటెం స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించినట్టు తెలుస్తోంది. మరోవైపు, 17 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికే మద్దతుగా మరో లేఖ ఇచ్చారు. దీంతో పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. సోమవారం జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా నేతలు రెండు బృందాలుగా విడివిడిగా హాజరుకావడంతో ఈ విభేదాలు మరింత స్పష్టమయ్యాయి.

ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో 167 స్థానాల్లో పోటీ చేసిన ఏఐఏడీఎంకే కేవలం 47 సీట్లకే పరిమితమైంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ పళనిస్వామి పదవి నుంచి తప్పుకోవాలని కొంతకాలంగా అసమ్మతి వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో షణ్ముగం వర్గం, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకోవాలంటే, తమ వర్గానికి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

అయితే, ఈ పరిణామాలపై ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఇసక్కి సుబయ్య స్పందించారు. పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదని, అంతా సజావుగానే ఉందని ఆయన అన్నారు. "పార్టీని ఎవరూ చీల్చలేరు. నాయకత్వ మార్పుపై జరుగుతున్నవి కేవలం చర్చలు మాత్రమే" అని పేర్కొంటూ విభేదాల వార్తలను కొట్టిపారేశారు.
Go Back to Shorts
Edappadi Palaniswami
AIADMK crisis
Tamil Nadu politics
CV Shanmugam
Tamilaga Vettri Kazhagam
Vijay TVK
Tamil Nadu Assembly Elections
AIADMK split
political turmoil
SP Velumani

More Telugu News