తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం.. 17 లైసెన్స్ సేవలు ఇక ఆన్‌లైన్‌లోనే!

  • ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లకుండానే లైసెన్స్ సేవలు
  • ఆధార్‌తో ఇంటి నుంచే లైసెన్స్ పనులు పూర్తి చేసుకునే అవకాశం
  • లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ వంటి కీలక సేవలు ఆన్‌లైన్‌లోనే
  • త్వరలో 'నెక్స్ట్‌జెన్ ఎం-పరివాహన్' యాప్‌లోనూ ఈ సేవలు
తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ భారీ ఊరట కల్పించింది. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన 17 రకాల సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తూ 'ఫేస్‌లెస్' విధానాన్ని ప్రారంభించింది. ఇకపై చిన్న చిన్న పనుల కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ గంటల తరబడి తిరగాల్సిన అవసరం లేదని, ఆధార్ ధ్రువీకరణ ద్వారా ఇంటి నుంచే ఈ సేవలను పొందవచ్చని రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తి తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకతను పెంచడం, సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ కొత్త విధానం ద్వారా లెర్నర్ లైసెన్స్‌లో పేరు, చిరునామా, ఫొటో, సంతకం మార్పులు, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్ జారీ వంటివి సులభంగా చేసుకోవచ్చు. అలాగే, అత్యంత కీలకమైన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ లైసెన్స్, లైసెన్స్ రీప్లేస్‌మెంట్, పుట్టిన తేదీ మార్పు, బయోమెట్రిక్ వివరాల సవరణ వంటి సేవలను కూడా ఫేస్‌లెస్ పద్ధతిలో అందిస్తున్నారు. ఈ సేవలను పొందడానికి పౌరులు అధికారిక 'సారథి' వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు.

వీటితో పాటు ప్రమాదకర వ్యర్థాల రవాణాకు అవసరమైన హజార్డస్ లైసెన్స్ ఎండార్స్‌మెంట్, డూప్లికేట్ పబ్లిక్ సర్వీస్ వెహికల్ (పీఎస్‌వీ) బ్యాడ్జ్ జారీ, లైసెన్స్ నుంచి ఏదైనా వాహన విభాగాన్ని తొలగించడం వంటి సేవలు కూడా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో డిజిటల్ పాలనను పటిష్ఠం చేయడంలో భాగంగా, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించి, పౌరులకు పారదర్శకమైన సేవలు అందించడమే ఈ ఫేస్‌లెస్ విధానం యొక్క ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలోనే 'నెక్స్ట్‌జెన్ ఎం-పరివాహన్' మొబైల్ యాప్‌లోనూ తీసుకురానున్నట్లు కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా సులభంగా పనులు పూర్తి చేసుకోవచ్చు. కార్యాలయాలపై పని భారాన్ని తగ్గించడంతో పాటు, ప్రజలకు సమయం, శ్రమ ఆదా కావాలనే ఉద్దేశంతో ఈ విప్లవాత్మక మార్పులు చేసినట్లు రవాణా శాఖ పేర్కొంది. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

driving license
K Ilambarthi
Telangana transport department
online services
RTO
Sarathi website
M parivahan app
face less services
license renewal
digital governance

More Telugu News