మెదక్‌లో దారుణం.. పసికందును రూ.1.50 లక్షలకు అమ్మేసిన నర్సు

Nurse Selling Newborn in Medak
  • బిడ్డ చనిపోయిందని తల్లిని నమ్మించి మోసం
  • రూ.1.50 లక్షలకు శిశువును విక్రయించిన వైనం
  • ఐదు రోజుల తర్వాత తల్లికి తెలిసిన అసలు నిజం  
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
మెదక్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన పసికందు చనిపోయిందని తల్లిని నమ్మించిన ఓ నర్సు, ఆ శిశువును రూ.1.50 లక్షలకు విక్రయించింది. ఈ అమానవీయ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన నస్రా ఫాతిమా సికింద్రాబాద్‌లోని మౌలాలిలో నివసిస్తోంది. ఏడు నెలల గర్భిణిగా ఉన్న ఆమె, ఇటీవల తన అత్తగారింటికి వెళ్లేందుకు మెదక్‌కు వచ్చింది. బస్టాండ్‌లో ఆమె చేతిలోని చిప్స్ ప్యాకెట్‌ను చూసిన కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనతో భయపడిపోయిన ఆమెను స్నేహితురాలు స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు శస్త్రచికిత్స చేయగా, ఫాతిమా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అక్తరీ బేగం, పుట్టిన పాప చనిపోయిందని ఫాతిమాను నమ్మించింది. నర్సు మాటలు నిజమని భావించిన ఫాతిమా, తీవ్ర దుఃఖంతో మూడు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లింది.

అయితే, ఐదు రోజుల తర్వాత ఓ వ్యక్తి ద్వారా తన పాప బతికే ఉందని ఫాతిమాకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించి, నర్సు అక్తరీ బేగంపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Medak
baby selling
nurse arrested
infant death
crime news
Telangana
child trafficking
hospital
Nasra Fatima

More Telugu News