తమిళనాడులో విజయ్ పార్టీ కీలకం కానుందా?

  • మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
  • డీఎంకే గెలుస్తుందని అంచనా వేసిన అత్యధిక సర్వేలు
  • మెజారిటీకి స్వల్ప దూరంలో నిలుస్తుందని మరికొన్ని సర్వేల అంచనాలు
  • దీనితో విజయ్‌తో సంప్రదింపులకు అన్నాడీఎంకే ప్రయత్నిస్తున్నట్లు కథనాలు
234 స్థానాలు కలిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4వ తేదీన వెల్లడి కానున్నాయి. ఎగ్జిట్ పోల్ సరళిని చూస్తే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని సర్వేలు డీఎంకే మేజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో ఉంటుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో సంప్రదింపులు జరపడానికి సిద్ధమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

డీఎంకే, అన్నాడీఎంకేలు మేజిక్ ఫిగర్‌కు దగ్గరగా ఆగిపోతే, విజయ్ పార్టీ కీలకంగా మారుతుందని భావిస్తున్నారు. విజయ్ పార్టీకి 4 నుంచి 30 సీట్ల వరకు వస్తాయనే అంచనాలు వెలువడ్డాయి. యాక్సిస్ మై ఇండియా ఒక్కటే టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్ల వరకు గెలుచుకుంటుందని తెలిపింది.

యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం విజయ్ పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలుచుకుని, డీఎంకే నేతృత్వంలోని కూటమితో సమానంగా నిలుస్తుందని తెలిపింది. డీఎంకే - కాంగ్రెస్ కూటమి 92 నుంచి 110 సీట్లు, ఎన్డీయే 22 నుంచి 32 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.

ముఖ్యమంత్రి పదవికి విజయ్ అత్యంత ప్రాధాన్యత కలిగిన అభ్యర్థిగా 37 శాతం మద్దతుతో నిలిచారని, 35 శాతం మద్దతుతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కంటే స్వల్పంగా ముందున్నారని కూడా ఈ ఎగ్జిట్ పోల్ తెలిపింది. యువ ఓటర్లలో టీవీకేకు బలమైన మద్దతు ఉందని వెల్లడించింది. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న తొలిసారి ఓటు వేస్తున్న వారిలో 68 శాతం, 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 59 శాతం, 30 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 45 శాతం మద్దతు విజయ్‌కి ఉందని సర్వే అంచనా వేసింది.

Can Vijay Party play key role in Tamilnadu
AIADMK eyes talks with Vijay's TVK

More Telugu News