ఒక లీటరు ఇంధనం కోసం 10,000 లీటర్ల నీరా? భారత ఇథనాల్ వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం!

  • ఇథనాల్ తయారీతో నీటి కష్టాలు
  • వరి నుంచి ఇంధనం చాలా ఖరీదు
  • భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం
  • ఇథనాల్‌ పరిశ్రమలతో నీటి కాలుష్యం
ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపే కార్యక్రమాన్ని భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. దీన్ని ‘స్వచ్ఛ ఇంధనం’గా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే దీని వెనక భయంకరమైన నీటి వృథా దాగి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇథనాల్ తయారీకి వాడే వరి, చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు చాలా నీరు అవసరం. దీనివల్ల దేశంలో ఇప్పటికే ఉన్న నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

వరి నుంచి ఇంధనం
ప్రస్తుతం ప్రభుత్వం వరి నుంచి ఇథనాల్ తయారీపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందుకోసం సుమారు 90 లక్షల టన్నుల బియ్యాన్ని డిస్టిలరీలకు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల పేదలకు రేషన్ షాపుల ద్వారా ఇచ్చే బియ్యంలో కోత విధించాల్సిన అవసరం రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
నీటి వినియోగం ఇలా
ఒక్క లీటరు ఇథనాల్ తయారు చేయడానికి ఏయే పంటల నుంచి ఎంత నీరు ఖర్చవుతుందో చూస్తే ఆందోళన కలగక మానదు. స్థూలంగా వరి నుంచి తయారు చేస్తే 10,790 లీటర్లు, మొక్కజొన్న 4,670 లీటర్లు, చెరకు నుంచి అయితే 3,630 లీటర్లు వాడాల్సి వస్తుంది. ఒక కిలో బియ్యం పండించడానికి సుమారు 3,000 లీటర్ల నీరు అవసరమైతే దాని నుంచి వచ్చే ఇథనాల్ పరిమాణం చాలా తక్కువ. అంటే ఒక్క లీటరు ఇంధనం కోసం మనం వేల లీటర్ల నీటిని వదులుకోవాల్సి వస్తుంది.

నీటి ఎద్దడి రాష్ట్రాలపై అదనపు భారం
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం.. 2030 నాటికి దిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి 21 ప్రధాన నగరాల్లో భూగర్భ పూర్తిగా అడుగంటే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ తయారీ సామర్థ్యం 1,822 కోట్ల లీటర్లకు చేరింది. అయితే ఈ తయారీ కేంద్రాలు ఎక్కువగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి నీటి ఎద్దడి ఉన్న రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఇలాంటి స్థితిలో పారిశ్రామిక అవసరాల కోసం భూగర్భ జలాలను భారీగా తోడటం వల్ల సామాన్యుల బతుకు భారంగా మారుతుంది.

వ్యర్థాలతో మరో ముప్పు
ఇథనాల్ పరిశ్రమల వల్ల కేవలం నీటి వినియోగమే కాకుండా కాలుష్యం కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఈ మిల్లుల నుంచి వచ్చే వ్యర్థ జలాలను సరైన పద్ధతిలో శుద్ధి చేయకపోతే అవి నదులను, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. దీనివల్ల సాగు, తాగునీరు విషతుల్యంగా మారే ప్రమాదం ఉంది.




Ethanol
Bio Fuel
Fuel Crisis
Alternative Fuel
India

More Telugu News