టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం
- నారా లోకేశ్ చేత ప్రమాణస్వీకారం చేయించిన చంద్రబాబు
- ప్రమాణస్వీకారం చేసిన పొలిట్ బ్యూరో, ఇతర కమిటీల నేతలు
- మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమం
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యువనేత, మంత్రి నారా లోకేశ్ ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు లోకేశ్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. లోకేశ్ తో పాటు పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో కూడా చంద్రబాబు ప్రమాణం చేయించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.
యువతకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూనే, అనుభవజ్ఞులైన నేతలను పొలిట్ బ్యూరోలో కొనసాగించడం ద్వారా 'పాత-కొత్త' కలయికను సమర్థవంతంగా అమలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు కూడా పొలిట్ బ్యూరోలో చోటు కల్పించడం ద్వారా, సాధారణ కార్యకర్త కూడా ఉన్నత స్థాయికి ఎదగగలడనే బలమైన సంకేతాన్ని పార్టీ పంపింది.
ఇకపై ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ లోకేశ్ పాత్ర ఇప్పుడు మరింత కీలకం కాబోతోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించినట్లు కనిపిస్తోంది. పదవుల కేటాయింపులో సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ భారీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.