టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అప్పల నరసింహరాజు కన్నుమూత
- విశాఖ జిల్లా పాండ్రంగిలోని తన నివాసంలో తెల్లవారుజామున కన్నుమూసిన అప్పల నరసింహరాజు
- ఆయన వయసు 82 సంవత్సరాలు
- సంతాపం తెలియజేసిన చంద్రబాబు, పలువురు రాజకీయ ప్రముఖులు
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అప్పల నరసింహరాజు కన్నుమూశారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలోని తన నివాసంలో ఈ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. 82 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. భీమునిపట్నం కోటలో అజేయమైన నాయకుడిగా ఆయనకు పేరుంది. 1985 నుంచి 1999 వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, భీమిలి అంటే అప్పల నరసింహరాజు అన్నంతగా గుర్తింపు పొందారు.
ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన, నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. చంద్రబాబుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. పాండ్రంగిలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.