అమరావతి పనులకు ప్రత్యేకంగా పెట్రోల్, డీజిల్ కోరడం చట్టవిరుద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna Reddy on petrol crisis in AP
  • ఇంధన కొరత వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్న సజ్జల
  • ఇంధనాన్ని అమరావతికి మళ్లించడం వల్లే రాష్ట్రంలో కొరత ఏర్పడిందని ఆరోపణ
  • రాష్ట్రాన్ని చంద్రబాబు 20 ఏళ్లు వెనక్కి తీసుకెళుతున్నారని విమర్శ

ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ కొరత వెనుక కూటమి ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా ప్రజలు ఇంధనం కోసం అల్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అక్కడ లేని ఇబ్బందులు.... కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు వస్తున్నాయని ఆయన నిలదీశారు.


ముఖ్యంగా సివిల్ సప్లై కమిషనర్ రాసిన ఒక లేఖను సజ్జల ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏప్రిల్ 24న ఆయిల్ కంపెనీలకు రాసిన లేఖలో, అమరావతి పనుల కోసం ప్రత్యేకంగా పెట్రోల్, డీజిల్ కేటాయించాలని కోరడం చట్టవిరుద్ధమని ఆయన మండిపడ్డారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తూ ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని సూచించిందని అన్నారు. రాజధాని పనుల పేరుతో సామాన్య ప్రజలకు అందాల్సిన ఇంధనాన్ని మళ్లించడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని సజ్జల విమర్శించారు.


చంద్రబాబు రాష్ట్రాన్ని మరో 20 ఏళ్లు వెనక్కి తీసుకెళుతున్నారని, కనీసం డీజిల్ కూడా సరఫరా చేయలేని ప్రభుత్వం ఇక పరిశ్రమలను ఏం తీసుకువస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, తద్వారా పానిక్ బయింగ్‌కు దారితీసేలా ప్రభుత్వమే ఈ కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించిందని సజ్జల ధ్వజమెత్తారు.

Go Back to Shorts
Sajjala Ramakrishna Reddy
YSRCP
Chandrababu
TDP

More Telugu News