చంద్రబాబు విజనరీ లీడర్.. భారత్‌కు కొత్త డిజిటల్ గేట్‌వేగా వైజాగ్: జీత్ అదానీ

Chandrababu is a visionary leader Vizag is the new digital gateway for India says Jeet Adani
  • విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు
  • భారత్‌కు కొత్త డిజిటల్ గేట్‌వేగా విశాఖ మారుతుంద‌న్న జీత్ అదానీ  
  • ఏఐ డేటా సెంటర్ల కోసం అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంద‌ని వెల్ల‌డి
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై జీత్ అదానీ ప్రశంసలు
  • ఈ ప్రాజెక్టుతో ఏఐ విప్లవానికి వైజాగ్ నాంది పలికిందని వ్యాఖ్య
విశాఖపట్నం నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కీలక కేంద్రంగా మారనుంది. ఇక్కడ గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్‌కు మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మాట్లాడిన అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ జీత్ అదానీ, విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం ద్వారా ఏఐ రంగంలో భారత్ ఓ పెద్ద ముందడుగు వేసిందని అన్నారు. ఈ ప్రాజెక్టుతో విశాఖ నగరం ఇకపై భారత్‌కు కొత్త డిజిటల్ గేట్‌వేగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటివరకు డేటా సెంటర్లు ముంబై, చెన్నై నగరాలకే పరిమితమయ్యాయని, ఇప్పుడు ఆ జాబితాలో విశాఖ కూడా చేరిందని జీత్ అదానీ తెలిపారు. కంప్యూటింగ్ రంగంలో విశాఖ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించనుందని ఆయన పేర్కొన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా భారత్‌తో పాటు అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుందని వివరించారు.

ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు జీత్ అదానీ వెల్లడించారు. ఎక్కువ మంది ప్రజలకు, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు ఏఐ సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ నేతృత్వంలో రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం వేగంగా జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో విశాఖ నగరం ఏఐ విప్లవానికి నాంది పలికిందని జీత్ అదానీ అభివర్ణించారు.

Go Back to Shorts
Jeet Adani
Chandrababu
Vizag
Google Data AI Hub
Andhra Pradesh

More Telugu News