నాలాంటి వాళ్లకు ఇదొక ఎమోషన్: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh says AU is an emotion for him
  • ఆంధ్రా యూనివర్సిటీ ఒక సంస్థ మాత్రమే కాదు.. ఒక ఎమోషన్ అన్న మంత్రి నారా లోకేష్ 
  • దేశంలోనే ఏయూకు ఓవరాల్‌గా 3వ ర్యాంక్ సాధించడమే లక్ష్యం
  • ఏడాదిలోగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ 
  • పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు తెస్తామని వెల్లడి
ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదని, తన లాంటి వారికి అదొక ఎమోషన్ అని, ఇది ఆంధ్రప్రదేశ్‌కే కాక యావత్ భారతదేశానికే గర్వకారణమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సోమవారం విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అత్యంత వైభవంగా జరిగిన విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో లోకేష్ కీలక ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. "శతాబ్ద కాలంగా విజ్ఞాన కాంతులు పంచుతున్న ఏయూ గొప్పదనాన్ని జరుపుకోవడం గర్వంగా ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని, సచివాలయం, కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేశారు. ఆనాడు మనకున్నవి రెండే ఆస్తులు. ఒకటి ఆంధ్రా యూనివర్సిటీ, రెండు మన బ్రాండ్ సీబీఎన్. రాష్ట్ర విభజన తర్వాత మొదటి కేబినెట్ సమావేశం పెట్టుకోవడానికి కూడా చోటులేని పరిస్థితుల్లో ఏయూనే మాకు ఆశ్రయమిచ్చింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా ఇక్కడే జరిగాయి. ఇది ఏయూ చరిత్రలో మరువలేని ఘట్టం" అని గుర్తుచేశారు.

భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టమైన ప్రకటన

విద్యార్థులను ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ.. "నేను స్టాన్‌ఫోర్డ్, కార్నెగీ మెలన్ వంటి విశ్వవిద్యాలయాల్లో చదివినప్పటికీ, ఈరోజు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నాను. ఏయూలో చదివి ఉంటే బాగుండేదనిపిస్తోంది. మీ జోష్ చూశాక మీ కోసం మరింత కష్టపడాలనే తపన పెరుగుతోంది" అని అన్నారు. ఎంతోమంది మహానుభావుల త్యాగాలతో, దార్శనికుల కృషితో ఏయూ ఉన్నత శిఖరాలను అధిరోహించిందని, సీఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారి సేవలను కొనియాడారు.

ప్రస్తుతం ఏయూ.. రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉందని, అయితే ఇది తనకు సంతృప్తినివ్వడం లేదని స్పష్టం చేశారు. "ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశంలోనే ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో నిలిచినప్పుడే విద్యాశాఖ మంత్రిగా నాకు సంతృప్తి. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ కృషి చేయాలి" అని దిశానిర్దేశం చేశారు.

అమీర్ పేటలో నాలుగు నెలలు చాలు!

పరిశ్రమలకు, విద్యకు మధ్య ఉన్న అంతరాన్ని (స్కిల్ గ్యాప్) తొలగించాల్సిన అవసరం ఉందని లోకేష్ నొక్కి చెప్పారు. "నాలుగేళ్ల ఇంజనీరింగ్ చేసినా ఉద్యోగం సంపాదించలేని పరిస్థితి ఉండగా, అమీర్‌పేట్‌లో నాలుగు నెలల కోర్సుతో జాబ్ కొడుతున్నారు. ఈ స్కిల్ గ్యాప్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు పరిశ్రమలతో అనుసంధానం తప్పనిసరి. విద్యార్థులు ఏడాది పాటు ఫీల్డ్‌లో పనిచేసేలా విధానాలు తీసుకొస్తాం" అని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏడాదిలోగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని ప్రకటించారు.

ఈ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, భారతరత్న సచిన్ టెండూల్కర్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, పారిశ్రామికవేత్తలు గ్రంథి మల్లికార్జునరావు, బీవీఆర్ మోహన్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Andhra University
Centenary Celebrations
Vizag
TDP
Andhra Pradesh

More Telugu News