వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు
- ఏయూ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమం
- సీఎం చంద్రబాబు ఉత్తేజపూరిత ప్రసంగం
- యూనివర్సిటీ అభివృద్ధికి రూ.112 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన
- ఆవిష్కరణలు, స్టార్టప్‌లతో పారిశ్రామిక రంగానికి ఏయూ అనుసంధానం కావాలని పిలుపు
- గత వైభవాన్ని స్మరిస్తూనే భవిష్యత్‌కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వందేళ్ల ఏయూ పండుగ ఒక చారిత్రక ఘట్టమైతే, ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడం మరో చరిత్ర అని అన్నారు. గూగుల్ కంటే ముందే ఏయూ తన ఖ్యాతితో ప్రపంచాన్ని విశాఖతో అనుసంధానం చేసిందని, వివిధ దేశాల విద్యార్థులు ఇక్కడ చదవడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి కేబినెట్ సమావేశాన్ని ఏయూలోనే నిర్వహించామని, ఇది ఈ వర్సిటీకున్న ప్రత్యేకతను చాటుతోందని గుర్తుచేశారు.
ఏయూ చారిత్రక నేపథ్యాన్ని, దానికి సేవ చేసిన మహానుభావులను చంద్రబాబు స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం కంటే ముందే ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధికి జైపూర్ రాజా విక్రమ దేవ్, గజపతి, పిఠాపురం, బొబ్బిలి రాజవంశీయులు చేసిన కృషిని మర్చిపోలేమని అన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన కట్టమంచి రామలింగారెడ్డి తొలి వీసీగా బలమైన పునాది వేస్తే, రెండో వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశ రాష్ట్రపతిగా ఎదిగారని గుర్తుచేశారు. వెంకయ్య నాయుడు వంటి ఎందరో రాజకీయ ఉద్దండులను, పారిశ్రామికవేత్తలను అందించిన ఘనత ఏయూదని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రూ.112 కోట్లతో 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా, సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు, స్టార్టప్‌లకు వేదిక కావాలని పిలుపునిచ్చారు. నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.
"పని చేసే బాధ్యత మాది, సహకరించే బాధ్యత మాది, కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే" అంటూ విద్యార్థులను ఉత్తేజపరిచారు. బంగారం లాంటి విద్యార్థులు, మంచి ప్రొఫెసర్లు ఉన్నారని, ప్రపంచంలోని జ్ఞానాన్ని ఇక్కడికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గతం స్ఫూర్తితో భవిష్యత్‌లో ఏయూ మరో అద్భుతమైన చరిత్ర సృష్టిస్తుందన్న పూర్తి విశ్వాసం తనకుందని చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.