సామాన్యుడి పెళ్లికి ప్రధాని మోదీ ఆశీస్సులు.. ఆనందంలో నవ వరుడు!

  • కర్ణాటక యువకుడి వివాహానికి ప్రధాని మోదీ నుంచి శుభాకాంక్షల లేఖ
  • రాయచూరు జిల్లా వాసి రాజేశ్ నాయక్ పంపిన ఆహ్వానానికి ప్రధాని స్పందన
  • నవ దంపతులు ఆదర్శంగా నిలవాలంటూ లేఖలో మోదీ ఆకాంక్ష
  • ప్రధాని స్పందనపై రాజేశ్ నాయక్, ఆయన కుటుంబ సభ్యుల హర్షం
  • సామాన్యుడికి ప్రధాని గౌరవం ఇవ్వడం గర్వంగా ఉందన్న నవ వరుడు
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఓ సామాన్యుడి పట్ల చూపిన ఆదరణ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. కర్ణాటకకు చెందిన ఓ యువకుడు తన వివాహానికి ఆహ్వానిస్తూ పంపిన పెళ్లి పత్రికకు ప్రధాని స్పందించారు. కేవలం స్పందించడమే కాకుండా, నవ దంపతులను మనసారా ఆశీర్వదిస్తూ అధికారికంగా ఒక లేఖ పంపారు. ఈ విషయాన్ని ఆ యువకుడు వీడియో ద్వారా పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రధాని మోదీ తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని రాయచూరు జిల్లా కనిహాల గ్రామానికి చెందిన రాజేశ్ నాయక్ అనే యువకుడికి ఈ నెల‌ 13న సవిత అనే యువతితో వివాహం జరిగింది. ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతో తన పెళ్లికి ఆయనను కూడా ఆహ్వానించాలని రాజేశ్ భావించాడు. ఈ మేరకు తన పెళ్లి పత్రికను పోస్టు ద్వారా ప్రధాని కార్యాలయానికి పంపాడు. అయితే, దేశ ప్రధాని నుంచి స్పందన వస్తుందని ఆయన ఊహించలేదు.

కానీ, రాజేశ్ ఆశ్చర్యానికి గురయ్యేలా ఈ నెల‌ 16వ తేదీతో ప్రధాని మోదీ కార్యాలయం నుంచి అధికారికంగా ఒక లేఖ అందింది. ఆ లేఖలో ప్రధాని మోదీ నూతన వధూవరులను పేరుపేరునా అభినందించారు. “శ్రీ రాజేశ్ నాయక్ జీ, మీ వివాహానికి నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ శుభ సమయంలో మీరిద్దరూ అడుగుపెడుతున్న వేళ, మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మీ దంపతుల మనసులు, ఆలోచనలు, చేతలు ఎల్లప్పుడూ సామరస్యంగా ఉండాలి. ఒకరికొకరు అండగా నిలవండి. మీ కలలు, ఆశయాల సాధనలో ఒకరి చేతిని ఒకరు పట్టుకుని సాగండి” అని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు.

ప్రధాని నుంచి లేఖ అందడంపై రాజేశ్ నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. “నా పెళ్లి పత్రికను ప్రధాని చదువుతారని కలలో కూడా ఊహించలేదు. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ, ఒక సామాన్యుడి లేఖను పరిగణనలోకి తీసుకుని, ఇంత ఆత్మీయంగా స్పందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. ఇది నాకు, నా భార్యకు, మా కుటుంబానికి, మా కనిహాల గ్రామ ప్రజలందరికీ గర్వకారణం. ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని రాజేశ్ ఉద్వేగంగా తెలిపారు.

PM Modi
Rajesh Nayak
Karnataka Wedding
Indian Wedding
Wedding Invitation
Prime Minister
Raiachur
Kanhala Village
Savita

More Telugu News