ట్రైలర్ లాంచ్‌లో 'గాయపడ్డ సింహం' సీక్రెట్స్ రివీల్ చేసిన దిల్ రాజు

  • 'గాయపడ్డ సింహం' మరో 'జాతిరత్నాలు' అవుతుందని దిల్ రాజు ధీమా
  • సెకండాఫ్‌లో స్టార్ హీరోల రిఫరెన్సులతో వచ్చే 5 ఎపిసోడ్స్ కీలకమ‌ని వ్యాఖ్య‌
  • సినిమా ఫ్లాప్ అయితేనే తాను గాయపడతానన్న ప్రముఖ నిర్మాత
  • కాన్సెప్ట్ నచ్చి వెంటనే సినిమా కొన్నానని వెల్లడించిన దిల్ రాజు
  • తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రం మే 1న విడుదల
నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, హీరోగా నటించిన తాజా చిత్రం 'గాయపడ్డ సింహం'. ఈ సినిమా మే 1న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో నిన్న‌ హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హీరో దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ సినిమాపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిల్ రాజు మాట్లాడుతూ... "పవన్ సాదినేని ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పగానే చాలా బాగా నచ్చింది. వెంటనే ఈ సినిమా కొనేశాను. కానీ, సినిమా చూసేవరకు ఒక టెన్షన్ ఉండేది. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కొనేశామా అనిపించింది. నాలుగు రోజుల క్రితమే సినిమా చూశాను. చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ఇది చిన్న కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. 35 ఏళ్ల క్రితం వచ్చిన జేడీ చక్రవర్తి 'మనీ' లాంటిది. ఇటీవల వచ్చిన 'జాతిరత్నాలు' కూడా ఒక చిన్న ఐడియాతో వచ్చి పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది" అని అన్నారు.

సినిమాలోని కీలక అంశాలను పంచుకుంటూ... "ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు హీరోలు ఉన్నారు. తరుణ్ భాస్కర్‌తో పాటు ట్రంప్ కూడా హీరోనే. ఆ కాన్సెప్ట్ చాలా బాగా రాసుకున్నారు. సెకండాఫ్‌లో ప్రభాస్, మహేశ్‌ బాబు, యష్, అర్జున్ రెడ్డి వంటి స్టార్ హీరోల రిఫరెన్సులతో ఐదు ఎపిసోడ్స్ డిజైన్ చేశారు. అవి థియేటర్‌లో ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ఆ ఎపిసోడ్స్ కనుక వర్కవుట్ అయితే, ఇది మరో 'జాతిరత్నాలు' అవడం ఖాయం. శ్రీవిష్ణు క్యామియో, జేడీ చక్రవర్తి నటన సినిమాకు అదనపు బలం" అని దిల్ రాజు వివరించారు.

ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు దిల్ రాజు సరదాగా సమాధానమిచ్చారు. "మీరు ఎప్పుడు గాయపడతారు?" అని అడగ్గా, "సినిమాకు పైసలు పెడతాం కాబట్టి, అది ఫ్లాప్ అయితే గాయపడతాను. హిట్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది" అని బదులిచ్చారు. అయితే, తనకు బాగా గాయం మిగిల్చిన సినిమా పేరు చెప్పడానికి ఆయన నిరాకరించారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'గాయపడ్డ సింహం' చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు.

Dil Raju
Gaayapadda Simham
Tarun Bhaskar
Pawan Sadineni
Dulquer Salmaan
Telugu Movie Trailer Launch
Faria Abdullah
Manasa Choudary
Jathi Ratnalu
Telugu Cinema

More Telugu News