ఇది నాకు కూడా కొత్తగానే ఉంది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Says Dealing with Criminals is New to Him
  • టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్‌ల శిక్షణ శిబిరానికి హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు
  • రాజకీయ పోరాటాలు చేశాను కానీ నేరగాళ్లతో పోరాడటం కొత్తగా ఉందని వ్యాఖ్యలు
  • వైసీపీ ఒక కిల్లర్ పార్టీ అని, వారి ఆలోచనా విధానాన్ని అధ్యయనం చేయాలని సూచన
  • దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతాలను ప్రస్తావిస్తూ క్యాడర్‌ను అప్రమత్తం చేసిన సీఎం
  • కార్యకర్తలే టీడీపీకి అధినేతలని, ప్రతి ఒక్కరూ నాయకుడిగా ఎదగాలని పిలుపు
  • వైసీపీ విధ్వంసాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ, ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని దిశానిర్దేశం
"నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో రాజకీయ పోరాటాలు చేశాను కానీ, నేరగాళ్లతో ఏనాడూ పోరాడలేదు. ప్రస్తుత పరిణామాల్లో క్రిమినల్స్‌తో రాజకీయం చేయాల్సిన పరిస్థితి రావడం నాకు కూడా కొత్తగానే ఉంది" అంటూ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇంఛార్జ్‌ల శిక్షణా తరగతుల్లో భాగంగా ఏర్పాటు చేసిన 'కాఫీ కబుర్లు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమకాలీన రాజకీయాలపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. వైసీపీని ఒక 'కిల్లర్ పార్టీ'గా అభివర్ణించిన చంద్రబాబు, ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ కౌంటర్ ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధికారంలో లేకపోయినా వారి అరాచకాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఇటీవల కడపలో జరిగిన దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం వంటి ఘటనలను ఉదాహరణలుగా చూపించారు. 

"కడపలో ప్రభుత్వ భూముల పంపకాల్లో తేడాలు రావడంతో సొంత పార్టీ కార్యకర్త దస్తగిరినే హత్య చేశారు. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. వాళ్ల మనుషుల్ని వాళ్లే చంపుకుని, ఆ నేరాన్ని మనపై నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి" అని చంద్రబాబు హెచ్చరించారు.

అదేవిధంగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య ఉదంతాన్ని గుర్తుచేస్తూ, ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను సైతం బెదిరించారని ఆరోపించారు. "రోడ్ల మీదకు వస్తారు, రెచ్చగొడతారు, ప్రజలను ఇబ్బందులు పెడతారు. చర్యలు తీసుకుంటే దాన్ని రాజకీయం అంటారు. అన్యాయం జరిగిందని పరామర్శకు వెళ్లి, సొంత కార్యకర్తలను కార్ల కింద తొక్కించి చంపుతారు. కానీ తన కారు కింద పడిన కార్యకర్తను మాత్రం పరామర్శించరు. ఇలాంటి పార్టీని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

2019-24 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు నిత్యం గుర్తుచేయాలని, అదే సమయంలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను, వాటి అమలులో పడుతున్న కష్టాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. 

"నన్ను అరెస్టు చేసినా, పార్టీని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలను కాపాడుకున్నాను. టీడీపీలో కార్యకర్తలే అధినేతలు. ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతాం. రైట్ రాయల్‌గా బతకాలి. పార్టీ ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని మీరు ఎదగాలి" అని ఆయన పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలకు మంచి చేస్తే వారే మనల్ని గుర్తుంచుకుంటారని చంద్రబాబు హితవు పలికారు.
Go Back to Shorts
Chandrababu Naidu
TDP
YCP
Andhra Pradesh Politics
Criminal Politics
Dastagiri Murder
Ananta Babu
Political Violence
AP Government
TDP Leaders

More Telugu News