15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సమీరా రెడ్డి
- తెలుగు అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న సమీరా రెడ్డి
- 2014లో వివాహం తర్వాత సినిమాలకు దూరం
- ఇప్పుడు సంజయ్ దత్ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న ముద్దుగుమ్మ
టాలీవుడ్లో ‘జై చిరంజీవ’, ‘అశోక్’ తదితర సినిమాలతో భారీ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ సమీరా రెడ్డి... బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో మెరిసింది. అయితే, పెళ్లి తర్వాత తన కుటుంబం కోసం ఆమె సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమైంది. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.
2014లో వివాహం తర్వాత సినిమాలకు దూరమైన సమీరా రెడ్డి, ఇప్పుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆఖ్రీ సవాల్’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అభిజీత్ మోహన్ వారంగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆమె ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారు. ఇకపై రొటీన్ కమర్షియల్ పాత్రల కంటే నటనకు ఆస్కారం ఉన్న అర్థవంతమైన పాత్రలే చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ప్రయాణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం మే 8న విడుదల కానుంది. ఇందులో సంజయ్ దత్ ప్రొఫెసర్గా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి కుమారుడు నమాశి చక్రవర్తి ఒక విద్యార్థి పాత్రను పోషిస్తున్నాడు. ఇందిరా గాంధీ హత్య తర్వాతి పరిణామాలు, బాబ్రీ మసీదు కూల్చివేత వంటి కీలక చారిత్రక అంశాలను చూపించనున్నారు.