అయ్యర్‌ను వదులుకుని తప్పుచేశాం.. కేకేఆర్ మాజీ కోచ్ పశ్చాత్తాపం!

Shreyas Iyer Release Was a Mistake Says KKR Ex Coach
  • అయ్యర్‌ను వదులుకోవడంపై కేకేఆర్ మాజీ కోచ్ పశ్చాత్తాపం
  • వ్యూహాత్మక కారణాలతోనే అతడిని వదులుకోవాల్సి వచ్చిందన్న చంద్రకాంత్ పండిట్
  • పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చడంతో పాటు ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్
  • శ్రేయస్ తిరిగి భారత జట్టులోకి రావాలని ఆకాంక్షించిన పండిట్
  • అయ్యర్ పరిణతి చెందిన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడని ప్రశంస
భారత దేశవాళీ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరైన చంద్రకాంత్ పండిట్, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను వదులుకోవడంపై తాజాగా స్పందించాడు. 2024లో కేకేఆర్‌కు టైటిల్ అందించిన అయ్యర్‌ను ఆ తర్వాత వదులుకోవడం వ్యూహాత్మక తప్పిదమని, అతడిని జట్టు మిస్సయిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

ఒక స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ... "దురదృష్టవశాత్తు మేము అతడిని మిస్ అయ్యాం. శ్రేయస్ ఒక అద్భుతమైన ఆటగాడు. కేకేఆర్‌కు కెప్టెన్‌గా ట్రోఫీ అందించాడు. కానీ కొన్నిసార్లు పరిస్థితులు, విస్తృత వ్యూహాల వల్ల అలాంటి ఆటగాళ్లను వదులుకోవాల్సి వస్తుంది. కేకేఆర్ కోచ్‌గా ఆ నిర్ణయం నన్ను బాధపెట్టింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కానీ, పరిస్థితులు మాకు అనుకూలించలేదు" అని పండిట్ వివరించాడు. 

2024 ఐపీఎల్ సీజన్ తర్వాత కేకేఆర్ వదిలేసిన శ్రేయస్ అయ్యర్‌ను, పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) వేలంలో రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. పంజాబ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అయ్యర్, 2025 సీజన్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అంతేగాక‌ ప్రస్తుత 2026 సీజన్‌లోనూ తన జట్టును వరుసగా ఆరు మ్యాచ్‌లలో అజేయంగా నిలిపాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌లలో 52 సగటు, 182.45 స్ట్రైక్ రేట్‌తో 208 పరుగులు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.

భారత టీ20 జట్టులో శ్రేయస్‌కు చోటు దక్కకపోవడంపై కూడా పండిట్ స్పందించాడు. "జట్టులో తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు ఇలాంటివి సాధారణం. శ్రేయస్ భారత జట్టుకు ఆడి మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రస్తుతం పంజాబ్‌ను అతను నడిపిస్తున్న తీరు, అతని బ్యాటింగ్‌లో పరిణతి కనిపిస్తున్నాయి. భయంలేని మనస్తత్వంతో ఆడుతున్నాడు" అని ప్రశంసించాడు.

"శ్రేయస్‌కు మరో అవకాశం లభిస్తే బాగుంటుంది. ప్రపంచకప్ లాంటి టోర్నీలకు ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించినా, అది సెలక్షన్ కమిటీ నిర్ణయం. గతంలో బిషన్ సింగ్ బేడీ ఉండటం వల్ల పద్మాకర్ శివాల్కర్ వంటి గొప్ప ఆటగాళ్లకు జాతీయ జట్టులో అవకాశం రాలేదు. ఇలాంటివి క్రీడల్లో సహజం. శ్రేయస్ ప్రదర్శన చూస్తుంటే, అతను తిరిగి జట్టులోకి రావడానికి ఎంత పట్టుదలతో ఉన్నాడో అర్థమవుతోంది" అని చంద్రకాంత్ పండిట్ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Shreyas Iyer
KKR
Chandrakant Pandit
Kolkata Knight Riders
Punjab Kings
IPL
Indian Cricket
T20 World Cup
Cricket Coach
Cricket Selection

More Telugu News