నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య.. స్పందించిన బండి సంజయ్

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య.. స్పందించిన బండి సంజయ్

Bandi Sanjay Reacts to Narsampet RTC Driver Suicide
  • శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్య అన్న బండి సంజయ్
  • ప్రభుత్వం కాలయాపన కోసం కమిటీలు వేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శ
  • కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారని వెల్లడి
నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అన్నారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం కాలయాపన కోసం కమిటీలు వేసి మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారని చెప్పారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌లలో న్యాయం ఉందని బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు బీజేపీ మద్దతు పలుకుతుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడి తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, రెండు పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లిస్తామని కాంగ్రెస్ తన 'అభయహస్తం' హామీల జాబితాలో పేర్కొందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. ఆర్టీసీ యూనియన్‌ పునరుద్ధరణకు అనుమతిస్తామని కూడా చెప్పిందని గుర్తు చేశారు.
Advertisement
Bandi Sanjay
Narsampet RTC driver suicide
RTC strike
Telangana RTC
Congress party promises

More Telugu News