ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి షాక్.. ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం
- గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డి
- సర్వీస్ నిబంధనలను బేఖాతరు చేశారంటూ చర్యలు తీసుకున్న ప్రభుత్వం
- రిటైర్మెంట్ బెనిఫిట్లు, పెన్షన్ ప్రయోజనాలను కూడా కోల్పోనున్న వెంకట్రామిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డిపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో సర్వీస్ నిబంధనలను బేఖాతరు చేస్తూ వైసీపీ అభ్యర్థుల తరపున బహిరంగంగా ప్రచారం నిర్వహించారనే ఆరోపణలతో ఆయన్ను ఉద్యోగం నుండి తొలగిస్తూ (డిస్మిస్) సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుందని, దీనిపై జరిగిన విచారణ అనంతరం ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో ఆయన కేవలం ఉద్యోగాన్ని మాత్రమే కాకుండా, తనకు లభించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు, పెన్షన్ ప్రయోజనాలను కూడా పూర్తిగా కోల్పోతారని తెలుస్తోంది.