తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీయే కోసం రంగంలోకి టీడీపీ అధినేత

  • తమిళనాడులో ఎన్డీయే తరఫున ప్రచారానికి చంద్రబాబు
  • రేప‌టి నుంచి రెండు రోజుల పాటు పర్యటన
  • కోయంబత్తూరు, చెన్నై, మధురైలలో సభలు, రోడ్‌షోలు
  • ఎన్డీయే అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం
  • ఈ నెల‌ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) అభ్యర్థులకు మద్దతుగా ఆయన సోమవారం నుంచి రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నట్టు టీడీపీ ప్రకటించింది.

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు కోయంబత్తూరు, హోసూర్, చెన్నై, మధురై, సాత్తూరు ప్రాంతాల్లో పర్యటిస్తారు. సోమవారం మధ్యాహ్నం కోయంబత్తూరులో జరిగే బహిరంగ సభలో ప్రసంగించి తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం హోసూర్, తాలి లో జరిగే ర్యాలీలలో పాల్గొంటారు. సాయంత్రం చెన్నైలోని ఆవడిలో భారీ రోడ్‌షో నిర్వహించి ప్రజలు, ఎన్డీయే మద్దతుదారులతో నేరుగా మాట్లాడతారు.

రెండో రోజు మధురై, సాత్తూరులలో పర్యటించి, స్థానిక నేతలతో సమావేశమవుతారు. ఈ పర్యటన ద్వారా ఎన్డీయే కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, ఓటర్లతో సంబంధాలు బలోపేతం చేయడంతో పాటు కూటమి అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యమని టీడీపీ తెలిపింది. టెక్నాలజీ ఆధారిత పాలనలో పేరున్న నేతగా, తమిళనాడు భవిష్యత్తుకు ఎన్డీయే దార్శనికతను చంద్రబాబు వివరిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 21తో ప్రచారం ముగియనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.

Chandrababu
Tamil Nadu Elections
TDP
NDA Alliance
Coimbatore
Chennai
Election Campaign
Tamil Nadu Politics
Andhra Pradesh CM
Narendra Modi

More Telugu News