కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే మనమే ఆక్రమించుకుందాం: కవిత పిలుపు

  • ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు నెరవేర్చాలని కవిత డిమాండ్
  • లేదంటే కాంగ్రెస్ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరిక
  • అసెంబ్లీలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీల ఊసే ఎత్తలేదని ఆగ్రహం
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న భూమి ఇవ్వకపోతే మనమే ఆక్రమించుకుందామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి ఇప్పటికే ఉద్యమకారుల తరఫున ఎన్నో పోరాటాలు చేసిందని, మున్ముందు ఉద్యమకారులతో కలిసి పనిచేస్తుందని అన్నారు.

ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 'చలో సెక్రటరియేట్' పేరుతో సచివాలయ ముట్టడికి బయలుదేరగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్‌లకు తీసుకువెళ్లారు. మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌లో అరెస్టైన వారిని కవిత పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఉద్యమకారులను జైల్లో పెట్టడం దురదృష్టకరమని అన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఉద్యమకారులకు భూమి, పెన్షన్ హామీని అమలు చేయకుంటే జాగృతి ఆధ్వర్యంలో భూపోరాటాలు చేసి భూమి ఆక్రమించుకుంటామని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నదే ఉద్యమకారులని కవిత తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని పాలించినప్పటికీ, ఉద్యమకారులకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు పెన్షన్, భూమి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా హామీ నెరవేర్చకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై తెలంగాణ జాగృతి ఒత్తిడి చేస్తే, ఉద్యమకారుల బిల్లు పెడతామని హామీ ఇచ్చారని, కానీ అసెంబ్లీలో ఆ ఊసే ఎత్తకుండా మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ఉద్యమకారులు సచివాలయాన్ని ముట్టడించే పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. ఉద్యమకారులు దైర్యంగా ఉండాలని, మనం కొట్లాడి తెచ్చుకున్నతెలంగాణలో హక్కులు సాధించుకోవడం కష్టమేమీ కాదని అన్నారు.

Kavitha
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
Telangana Activists
Land Seizure
Congress Party

More Telugu News