కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీ ఏర్పాటు
  • కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీ
  • మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తి చేయాలన్న ప్రభుత్వం
బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీని వేసింది. మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తి చేయాలని కమిటీని ఆదేశించింది.

కల్నల్ పరీక్షిత్ మెహ్రా నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణులు. మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం చేయడం, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకురావడంపై కమిటీ పనిచేయనుంది. వారానికి రెండుసార్లు సమావేశమై పురోగతిని సమీక్షిస్తుంది. ప్రతిరోజు జరిగే పనులపై రోజువారీ పురోగతి నివేదికలను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

వర్షాకాలం ప్రారంభానికి ముందే కీలకమైన పరీక్షలను పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. బ్యారేజీల పునాదుల పటిష్ఠతను తెలుసుకోవడానికి మే 30వ తేదీ లోపు జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు, అనుమతుల మేరకు మాత్రమే ఈ మరమ్మతులు సాగనున్నాయి. ముందుగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి, మేడిగడ్డను పాక్షికంగానైనా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

Kaleshwaram Project
Telangana
Medigadda Barrage
Annaram Barrage
Sundilla Barrage
Irrigation Project

More Telugu News