నాన్నే నా రియల్ హీరో.. ఆ విష‌యం ఆయ‌న‌ను చూసే నేర్చుకున్నా: రామ్ చరణ్

  • ప్రతిష్ఠాత్మక 'ఈ స్క్వేర్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై రామ్ చరణ్
  • నా జీవితంలో అసలైన హీరో నాన్నేనని వ్యాఖ్య
  • షూటింగ్స్ కోసం చిరంజీవి రోజుకు 4 గంటలే నిద్రపోయేవారని వెల్లడి
  • కుటుంబం, వృత్తిని సమన్వయం చేసుకోవడం తండ్రి నుంచే నేర్చుకున్నానన్న చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అంతర్జాతీయ గుర్తింపును తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయన ప్రతిష్ఠాత్మక 'ఈ స్క్వేర్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "నా జీవితంలో నిజమైన హీరో నాన్నే" అని గర్వంగా చెబుతూ, ఆయన వ్యక్తిగత, వృత్తిగత జీవితం తనపై చూపిన ప్రభావాన్ని వివరించారు.

నాన్న వారసత్వం తమకు సులభంగానే అందినా, ఆయన పడిన కష్టం మాత్రం అపారమని చరణ్ పేర్కొన్నారు. సినిమాల కోసం చిరంజీవి ఎంతగా కష్టపడతారో వివరిస్తూ, "కొన్నిసార్లు షూటింగ్‌ల సమయంలో రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి. వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం అలాంటిది" అని గుర్తు చేసుకున్నారు. అంతటి బిజీ షెడ్యూల్‌లో కూడా చిరంజీవి కుటుంబానికి సమయం కేటాయించడంలో ఎప్పుడూ రాజీ పడలేదని రామ్ చరణ్ వెల్లడించారు. మూడు రోజులు విరామం దొరికినా వెంటనే కుటుంబంతో గడపడానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారని, ఆయన క్రమశిక్షణ తనకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు.

ఎంతటి స్టార్‌డమ్ ఉన్నప్పటికీ, ఇంట్లో మాత్రం చిరంజీవి ఒక సాధారణ తండ్రిలాగే ఉంటారని కొనియాడారు. పరిశ్రమలో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగే చిరంజీవి తత్వం తనపై ఎంతో ప్రభావం చూపిందని, తాను కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నానని పేర్కొన్నారు. వృత్తిపరమైన బాధ్యతలు, కుటుంబ బంధాలను సమన్వయం చేసుకోవడం ఎలాగో తన తండ్రిని చూసే నేర్చుకున్నానని రామ్ చరణ్ వివరించారు.

ఇక కెరీర్ విషయానికొస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో 'పెద్ది' అనే చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రేక్షకులకు మరింత మెరుగైన థియేట్రికల్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ నుంచి జూన్‌కు వాయిదా వేసినట్లు ఇటీవ‌ల మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Ram Charan
Chiranjeevi
E Square India
Peddi Movie
Janhvi Kapoor
Telugu Cinema
Mega Star
Tollywood
Buchibabu Sana
Film Shooting

More Telugu News