Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. గర్భవతినంటూ ముందస్తు బెయిల్‌కు వెళ్లిన సూత్రధారి నిదా ఖాన్!

Nida Khan Seeks Bail Claiming Pregnancy in TCS Case Twist
Advertisement
  • టీసీఎస్ నాసిక్ కేసులో పరారీలో ఉన్న నిదా ఖాన్
  • అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్
  • కేసులో ఈమెను మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న పోలీసులు
  • ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన సిట్
  • నేడు పిటిషన్‌పై విచారణ జరిపే అవకాశం
Advertisement
దేశవ్యాప్తంగా కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్‌లోని బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ, పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ అరెస్ట్ భయంతో నాసిక్ జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను గర్భవతినని, మానవతా దృక్పథంతో తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కేసులో నిదా ఖాన్ పాత్ర అత్యంత కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భావిస్తోంది. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు వారిని బెదిరించడం, నిందితులైన సీనియర్లకు కొమ్ము కాయడంలో ఆమెదే ప్రధాన పాత్ర అని ఆరోపణలున్నాయి. సిట్ బృందాలు ఆమె కోసం ముంబై, ఇతర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తుండగానే, ఆమె న్యాయవాదుల ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.

గర్భమే కీలక అస్త్రమా?
ముందస్తు బెయిల్ కోసం నిదా ఖాన్ తన గర్భాన్ని ప్రధాన కారణంగా చూపడం ఈ కేసులో వ్యూహాత్మక ఎత్తుగడగా కనిపిస్తోంది. సాధారణంగా మహిళలు, అందులోనూ గర్భవతులు నిందితులుగా ఉన్నప్పుడు న్యాయస్థానాలు కాస్త సానుభూతితో వ్యవహరించే అవకాశం ఉంటుంది. అయితే, కేసు తీవ్రత, ఆమెపై ఉన్న ఆరోపణల దృష్ట్యా కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది. పోలీసులు ఆమెను 'మాస్టర్‌మైండ్'గా పరిగణిస్తున్న నేపథ్యంలో, కేవలం గర్భం అనే కారణంతో ఆమెకు ఉపశమనం లభిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి. ఈ పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేసు నేపథ్యం ఇదీ..
టీసీఎస్ నాసిక్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న కొందరు సీనియర్లు, జూనియర్ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించారని, హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడారని, బలవంతంగా బురఖా ధరించి నమాజ్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చారని పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై మొత్తం 9 ఎఫ్ఐఆర్‌లు నమోదు కాగా, కేసు దర్యాప్తును సిట్ స్వీకరించింది. ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులందరినీ టీసీఎస్ ఇప్పటికే సస్పెండ్ చేసింది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఆదేశాలతో కంపెనీ అంతర్గత విచారణ కూడా వేగంగా కొనసాగుతోంది. ఒకవైపు పోలీసుల గాలింపు, మరోవైపు న్యాయపోరాటంతో ఈ కేసు రోజురోజుకు మరింత ఉత్కంఠను రేపుతోంది.
Advertisement
Advertisement
Nida Khan
TCS
Tata Consultancy Services
Forced Conversion
Sexual Harassment
Nasik
Anticipatory Bail
HR Manager
Corporate Crime
India

More Telugu News