ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.8,175 కోట్లతో లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీ

Waaree Energies to Invest Rs 8175 Crore in AP Lithium Battery Plant
  • రాంబిల్లిలో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు
  • రూ.8,175 కోట్ల పెట్టుబడితో వారీ ఎనర్జీ ఫ్యాక్టరీ
  • పరిశ్రమ కోసం 300 ఎకరాల భూమిని కేటాయించిన ప్ర‌భుత్వం
  • ఈ పరిశ్రమ ద్వారా 3,000 మందికి ఉపాధి అవకాశం
  • 2027 జులై నాటికి తొలి దశ పూర్తి చేయడమే లక్ష్యం
ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.8,175 కోట్ల వ్యయంతో లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ప్రముఖ సంస్థ వారీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ ఫ్యాక్టరీని నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఈ పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేటాయించింది. మొత్తం 16 గిగావాట్‌ అవర్‌ సామర్థ్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో సెల్, ప్యాక్, స్టోరేజ్‌కు అవసరమైన బ్యాటరీలను తయారు చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 3,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. మొదటి దశ పనులను 2027 జులై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ భారీ పరిశ్రమ రాబోతోంది. ఇటీవల కాలంలో విశాఖకు ఐటీ, అనకాపల్లికి పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. ఇక ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్న వారీ సంస్థకు గుజరాత్‌, అమెరికాలోని టెక్సాస్‌లో సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ యూనిట్లు ఉన్నాయి. సుమారు 30 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందింది.

భవిష్యత్తులో ఈ ప్లాంట్‌ను మరింత విస్తరించాలని వారీ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ (ఏసీసీ) లిథియం అయాన్‌ సెల్స్‌, బ్యాటరీ ప్యాక్‌ల తయారీ సామర్థ్యాన్ని 20 గిగావాట్ అవర్‌ వరకు పెంచాలని భావిస్తోంది. విద్యుత్ నిల్వకు కీలకమైన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) తయారీపై దృష్టి సారించనుంది. దేశంలోనే ఇటువంటి ప్రాజెక్టులు పరిమితంగా ఉన్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పారిశ్రామిక చిత్రపటంలో ఈ ఫ్యాక్టరీ కీలకపాత్ర పోషించనుంది.
Go Back to Shorts
Andhra Pradesh
Waaree Energies
Lithium-ion battery
Anakapalli
Battery manufacturing
Ramilli
AP investments
Energy storage
Solar modules
Make in India

More Telugu News