తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

  • రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో మరింత పెరగనున్న ఎండలు
  • మేడ్చల్, హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
  • మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లొద్దంటున్న వైద్య నిపుణులు

తెలంగాణలో భానుడు భగభగలాడుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా నేడు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.


రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు క్రమేపీ 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉంది. ఆరెంజ్ హెచ్చరికలు ఉన్న జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.


పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తలపాగా, గొడుగు వంటివి వినియోగించాలని, డీహైడ్రేషన్ కాకుండా తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలను తీసుకోవాలని హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎండల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


Telangana
Telangana weather
orange alert
heatwave
Hyderabad
Adilabad
গরম আবহাওয়া
weather forecast
heat stroke
সতর্কতা

More Telugu News