లాహోర్ దాడి ఘటన.. ఇప్పటికీ త‌న‌ శరీరంలో దాడి తాలూకు శకలాలు ఉన్నాయన్న సంగక్కర

Kumar Sangakkara Recalls Horrors of Lahore Attack After 17 Years
  • లాహోర్ దాడి ఘటనపై 17 ఏళ్ల తర్వాత స్పందించిన సంగక్కర
  • బాంబు పేలితే బాగుండని సహచర ఆటగాడి జోక్.. నిమిషంలోనే దాడి
  • శ్రీలంక అంతర్యుద్ధం ముందు తమ అనుభవం చాలా చిన్నదని వెల్లడి
  • 'మేము దాని కోసమే సైన్యంలో చేరాం' అన్న సైనికుడి మాటలు కదిలించాయని వ్యాఖ్య 
శ్రీలంక క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కుమార సంగక్కర.. 17 ఏళ్ల క్రితం తమ జట్టుపై జరిగిన ఉగ్రదాడిని గుర్తుచేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో లాహోర్‌లో పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఆ భయానక దాడి తన జీవిత దృక్పథాన్నే పూర్తిగా మార్చేసిందని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆయన ఆనాటి భయానక క్షణాలను పంచుకున్నారు.

2009 మార్చి 3న లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం సమీపంలో శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, సంగక్కర, అజంతా మెండిస్, తిలాన్ సమరవీర సహా పలువురు శ్రీలంక ఆటగాళ్లు గాయపడ్డారు. ఈ దాడి కారణంగా పాకిస్థాన్‌లో చాలా ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోయింది.

దాడికి ముందు జరిగిన ఓ సంఘటనను సంగక్కర గుర్తుచేసుకున్నాడు. "మేము మ్యాచ్ మూడో రోజు గ్రౌండ్‌కు బయలుదేరాం. బస్సులో ముందు సీట్లో కూర్చున్న ఓ ఫాస్ట్ బౌలర్, 'ఈ ఫ్లాట్ పిచ్‌లపై బౌలింగ్ చేసి నా నడుం విరిగిపోతోంది. ఓ బాంబు పేలితే హాయిగా ఇంటికి వెళ్లిపోవచ్చు' అని సరదాగా అన్నాడు. ఆ మాట అన్న నిమిషం కూడా గడవకముందే మా బస్సుపై దాడి జరిగింది" అని సంగక్కర తెలిపాడు.

ఆ దాడిలో తాను గాయపడ్డానని, ఇప్పటికీ తన కుడి వైపు శరీరంలో శ్రాప్‌నెల్ (తుపాకీ గుళ్ల శకలాలు) ఉందని సంగక్కర వెల్లడించారు. "నాకు ఎప్పుడూ పీడకలలు రాలేదు. కానీ, ఆ ఘటన శ్రీలంకలో అప్పుడు జరుగుతున్న అంతర్యుద్ధ పరిస్థితులపై నాకు గొప్ప అవగాహనను, కృతజ్ఞతాభావాన్ని ఇచ్చింది. మాకు కేవలం రెండు నిమిషాల పాటు ఆ భయానక అనుభవం ఎదురైతేనే అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద వార్త అయింది" అని అన్నాడు.

కొన్ని వారాల తర్వాత కొలంబోలో జరిగిన ఓ సంఘటన తనను మరింతగా కదిలించిందని సంగక్కర వివరించారు. "నేను కారులో వెళ్తుండగా ఓ సైనికుడు ఆపి, 'మీకు అలా జరిగినందుకు చాలా బాధపడ్డాం' అన్నాడు. 'ఇలాంటివి మీకు, మీ సైనికులకు రోజూ జరుగుతాయి కదా' అని నేను బదులిచ్చాను. దానికి ఆ సైనికుడు, 'అవును, కానీ మేము దానికోసమే సైన్యంలో చేరాం' అని చెప్పాడు. ఆ మాటలతో నేను నిశ్చేష్టుడనయ్యాను. డబ్బు తీసుకుని మేం ఆడేది ఒక ఆట. రెండు నిమిషాల అనుభవానికే మమ్మల్ని హీరోలుగా చూశారు. కానీ, 26 ఏళ్లుగా ఆ నరకాన్ని అనుభవించిన ప్రజలు, సైనికుల గురించి ఆలోచించాను. ఆ క్షణం నాలో అపారమైన మార్పు తీసుకొచ్చింది" అని సంగక్కర తెలిపాడు.
Go Back to Shorts
Kumar Sangakkara
Sri Lanka cricket
Lahore attack
Pakistan cricket
Terrorist attack
Gaddafi Stadium
2009 Lahore attack
Sri Lanka team bus attack
Cricket security
International cricket

More Telugu News