హర్మూజ్ బ్లాకేడ్ కు 15 అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు కూడా..!

Hormuz Strait Blockade US Navy Deploys 15 Warships
హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా నావికా దిగ్బంధనాన్ని ప్రారంభించింది. దీని కోసం అమెరికా ఏకంగా 15 యుద్ధనౌకలను మోహరించింది. వీటితో పాటు అత్యంత శక్తిమంతమైన ఉభయచర దాడి నౌక ‘యూఎస్ఎస్ ట్రిపోలి’ని కూడా రంగంలోకి దించింది. ప్రస్తుతం ఈ నౌక అరేబియా సముద్రంలో ఎఫ్-35బి స్టెల్త్ ఫైటర్లు, ఎంవీ-22 ఆస్ప్రే విమానాలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సోమవారం రాత్రి ఈ దిగ్బంధనం ప్రారంభమైనట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది.

ఈ దిగ్బంధనం ఇరాన్ నౌకాశ్రయాలకు వచ్చే, అక్కడి నుంచి వెళ్లే అన్ని నౌకలకు వర్తిస్తుంది. అయితే, ఇతర దేశాల ఓడరేవులకు వెళ్లే నౌకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని అమెరికా స్పష్టం చేసింది. తగిన గుర్తింపు, అనుమతి లేకుండా హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించే నౌకలను అడ్డుకుంటామని తెలిపింది. ఆయా నౌకలను దారి మళ్లించడమో లేక స్వాధీనం చేసుకోవడమో జరుగుతుందని హెచ్చరించింది. ప్రపంచంలోని ముడి చమురు, ఎల్ఎన్‌జీలో దాదాపు 20 శాతం ఈ జలసంధి నుంచే రవాణా అవుతుంది. ఈ దిగ్బంధనం ద్వారా ఇరాన్ ఆదాయానికి గండి కొట్టాలని అమెరికా భావిస్తోంది. కాగా, దిగ్బంధనం మొదలైన తర్వాత రెండు నౌకలు వెనక్కి మళ్లినట్లు షిప్-ట్రాకింగ్ డేటా ద్వారా తెలిసిందని రాయిటర్స్ నివేదించింది.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ దిగ్బంధనం వైపు వచ్చే ఇరాన్ ఫాస్ట్-ఎటాక్ నౌకలను ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. "ఇప్పటికే ఇరాన్‌కు చెందిన 158 నౌకలు సముద్ర గర్భంలోకి చేరాయి. మా దిగ్బంధనం వద్దకు వస్తే మిగతావాటిని కూడా తుడిచిపెట్టేస్తాం" అని ఆయన సోషల్ మీడియా ద్వారా ఇరాన్ కు హెచ్చరికలు పంపించారు. ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమైన కొన్ని గంటల్లోనే ట్రంప్ ఈ దిగ్బంధనాన్ని ప్రకటించడం గమనార్హం. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేనందువల్లే చర్చలు విఫలమయ్యాయని ఆయన తెలిపారు.
Go Back to Shorts
Hormuz Strait
Iran
US Navy
USS Tripoli
Donald Trump
Oil transport
Strait blockade
F-35B fighters
Middle East tensions
Maritime security

More Telugu News