బట్లర్ బాదుడు, గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్... గుజరాత్ టైటాన్స్ ఈజీ విన్

ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జోస్ బట్లర్ (60), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) అర్ధసెంచరీలతో చెలరేగడంతో, 165 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ సునాయాసంగా ఛేదించింది.

లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే సాయి సుదర్శన్ (15) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్, గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. బట్లర్ కేవలం 37 బంతుల్లో 11 ఫోర్లతో 60 పరుగులు చేసి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు గిల్ 40 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 84 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. 

చివర్లో వాషింగ్టన్ సుందర్ (21*), రాహుల్ తెవాటియా (10*) లాంఛనాన్ని పూర్తి చేయడంతో, గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు లక్నో బ్యాటర్లు తడబడ్డారు. ఐడెన్ మార్క్‌రమ్ (30) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్ద స్కోరు చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లతో లక్నో పతనాన్ని శాసించాడు.

Jos Buttler
Shubman Gill
Gujarat Titans
IPL 2026
Lucknow Super Giants
Sai Sudarshan
Prasidh Krishna
Tewatia
Cricket

More Telugu News