పవన్ క‌ల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెడీ.. స్టాండప్ కమెడియన్‌కు జనసేన వార్నింగ్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని స్టాండప్ కమెడియన్ అనుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన ప్రదర్శనలో పవన్ వ్యక్తిగత జీవితం, వివాహాలపై అనుదీప్ చేసిన హాస్యం హద్దులు దాటిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ, కమెడియన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

స్టాండప్ కామెడీ ప్రదర్శనలో భాగంగా అనుదీప్.. పవన్ కల్యాణ్ వివాహాలు, విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. అంతేగాక‌ ఆయన కుటుంబసభ్యుల పేర్లను కూడా ఉటంకిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్యం పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటం, వారిని కించపరిచేలా మాట్లాడటం భావప్రకటనా స్వేచ్ఛ కిందికి రాదని పలువురు హితవు పలుకుతున్నారు.

ఈ వివాదంపై జనసేన నాయకుడు సందీప్ పంచకర్ల తీవ్రంగా స్పందించారు. అనుదీప్‌కు ఇది చివరి హెచ్చరిక అని, తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరచడం, దూషించడం స్టాండప్ కామెడీ కాదని ఆయన అన్నారు. "ఏపీ డిప్యూటీ సీఎంను లక్ష్యంగా చేసుకుని, ఆయన కుటుంబసభ్యులైన మహిళల పేర్లను వివాదంలోకి లాగడం అత్యంత నీచమైన చర్య. ఇది మర్యాద, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధులను దాటింది" అని సందీప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

నిర్మాణాత్మక విమర్శలకు తాము వ్యతిరేకం కాదని, కానీ మహిళలను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పని పక్షంలో చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. వ్యక్తిత్వ హననం అనేది కళ కాదని, అదొక నేరమని సందీప్ పంచకర్ల ఘాటుగా వ్యాఖ్యానించారు. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులు పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం, జనసేన నేతలు వాటిని తిప్పికొట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే, ఒక స్టాండప్ కామెడీ షోలో ఇలాంటి వ్యాఖ్యలు రావడంపై జనసైనికులు మరింత ఆగ్రహంతో ఉన్నారు.

Pawan Kalyan
Anudeep
Janasena
Standup Comedy
Andhra Pradesh
AP Deputy CM
Personal Life
Controversy
Sandeep Panchakarla
Political Criticism

More Telugu News