గ్యాస్ లేకుండానే మంట.. వంట గదిలోకి కొత్త టెక్నాలజీ.. ప్లాస్మా స్టవ్ ప్రత్యేకతలివే!

గ్యాస్ సిలిండర్ లేకుండా, కేవలం విద్యుత్‌తోనే ఎల్పీజీ స్టవ్ తరహాలో మంటను సృష్టించే సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీన్నే 'ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్'గా పిలుస్తున్నారు. పెరుగుతున్న గ్యాస్ ధరలు, పర్యావరణ హిత ఇంధనాల వైపు ప్రపంచం చూస్తున్న తరుణంలో ఈ ఆవిష్కరణ భారతీయ వంట గదుల రూపురేఖలను మార్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ టెక్నాలజీని ప్రత్యేకంగా ప్రస్తావించడం దీని ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

ప్లాస్మా స్టవ్ ఎలా పనిచేస్తుంది?
ఈ స్టవ్ 'ప్లాస్మా ఆర్క్ టెక్నాలజీ' అనే సూత్రంపై పనిచేస్తుంది. ఇది విద్యుత్‌ను ఉపయోగించి గాలిని అయాన్లుగా విడగొట్టి, ఎలాంటి ఇంధనం మండించకుండానే అత్యంత వేడి మంటను సృష్టిస్తుంది. ఈ మంట ఉష్ణోగ్రత దాదాపు 1200 నుంచి 1300 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన వెంటనే మంట వచ్చినట్లే, ఇది కూడా తక్షణమే వేడిని అందిస్తుంది.

ఎల్పీజీ, ఇండక్షన్‌కు దీనికి తేడా ఏంటి?
ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇండక్షన్ స్టవ్‌లకు, గ్యాస్ స్టవ్‌లకు ఇది పూర్తి భిన్నమైంది. ఇండక్షన్ స్టవ్‌పై కొన్ని ప్రత్యేకమైన పాత్రలను మాత్రమే వాడగలం. కానీ, ప్లాస్మా స్టవ్‌పై స్టీల్, అల్యూమినియం, ఇత్తడి, ఇనుము వంటి అన్ని రకాల పాత్రలను ఉపయోగించవచ్చు. ఎల్పీజీ స్టవ్‌లో లాగే మంట కంటికి కనిపిస్తూ, నాబ్ ద్వారా మంట తీవ్రతను నియంత్రించే సౌలభ్యం ఉండటం దీని ప్ర‌త్యేక‌త‌. రోటీలు, తాలింపులు, వేపుళ్లు వంటి భారతీయ వంటకాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

ముఖ్యమైన ఫీచర్లు.. ధర ఇలా..!
ఈ స్టవ్ 80 నుంచి 90 శాతం అధిక సామర్థ్యంతో పనిచేస్తుంది. దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది. గ్యాస్ లీకేజీ భయం, పొగ, మసి వంటి సమస్యలు ఉండవు. ఓవర్‌హీట్ ప్రొటెక్షన్, ఆటో షట్-ఆఫ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సింగిల్, డబుల్ బర్నర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న ఈ స్టవ్ ధర సుమారు రూ. 35,000గా ఉంది.

భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
'పీఎం సూర్య ఘర్ యోజన' వంటి పథకాలతో కేంద్రం సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఈ స్టవ్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే, వంటకు అయ్యే ఖర్చు దాదాపు సున్నాకు చేరుకోవచ్చు. ఇది ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడటాన్ని తగ్గించి, కర్బన ఉద్గారాలను నియంత్రిస్తుంది. అయితే, దీని అధిక ప్రారంభ ధర, నిరంతర విద్యుత్ సరఫరాపై ఆధారపడటం వంటివి ప్రస్తుతానికి సవాళ్లుగా ఉన్నాయి. భవిష్యత్తులో దేశీయంగా ఉత్పత్తి పెరిగి, ధరలు తగ్గితే మాత్రం ఇది ప్రతి వంటింట్లో విప్లవాత్మక మార్పు తీసుకురావడం ఖాయం.

Plasma Stove
Prahlad Joshi
Electric stove
Plasma arc technology
Gas stove alternative
Induction stove
PM Surya Ghar Yojana
Cooking technology
Renewable energy
Kitchen appliances

More Telugu News