రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు వివక్ష: అనంతపురం జిల్లా వైసీపీ నేతల ధ్వజం

Chandrababu Naidu Accused of Bias Against Rayalaseema Projects by YSRCP Leaders
షార్ట్స్‌లో చూడండి

రాయలసీమ ప్రాంత ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుంచి చులకన భావంతోనే ఉన్నారని, సీమ అభివృద్ధిని ఆయన అడ్డుకుంటున్నారని అనంతపురం జిల్లా వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ అనంతపురంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.


రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను అర్ధాంతరంగా నిలిపివేయడం వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. తాను చెబితేనే చంద్రబాబు ఈ పనులు ఆపేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినా, దానిపై మన ముఖ్యమంత్రి మౌనంగా ఉండటం సీమ ప్రజల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యాన్ని చాటుతోందని దుయ్యబట్టారు.


మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల నీటి మట్టంలో ఉన్నప్పుడే నీటిని తరలించే అవకాశం కల్పించే ఈ ప్రాజెక్టును నిలిపివేయడం దుర్మార్గమని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటే, ఏపీ ముఖ్యమంత్రి మాత్రం పొరుగు రాష్ట్ర సీఎం మాట విని సీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. రాయలసీమపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, ఈ ప్రాజెక్టు పూర్తయితేనే రాయలసీమలో నీటి వాటాలను కచ్చితంగా పొందగలమని ఆయన స్పష్టం చేశారు.


మరోవైపు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ప్రాజెక్టును 'దొంగ ప్రాజెక్టు' అని సంబోధించారంటూ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దొంగ ప్రాజెక్టే అయితే ప్రభుత్వం ఎందుకు వెయ్యి కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేసిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అత్యంత కీలకమని, చంద్రబాబు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ప్రజలందరినీ ఏకం చేసి పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. రాయలసీమకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం రాజీలేని పోరాటం చేస్తామని ఈ సమావేశం వేదికగా వారు స్పష్టం చేశారు.

Go Back to Shorts
Chandrababu Naidu
Rayalaseema Lift Irrigation Project
Anantapur District
YSRCP Leaders
Andhra Pradesh Projects
Revant Reddy
Paiyavula Keshav
AP Politics
Irrigation Projects
Water Resources

More Telugu News