రాసిపెట్టుకోండి.. 'పెద్ది'తో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు ఖాయం: శివరాజ్ కుమార్

Ram Charan to win National Award for Peddi says Shivarajkumar
  • పవన్ కల్యాణ్, రామ్ చరణ్ మధ్య బంధం త‌న‌ను విశేషంగా ఆకట్టుకుంద‌ని వ్యాఖ్య‌
  • ఈ చిత్రంలో త‌న‌ది కోచ్ తరహా పాత్ర గౌర్ నాయుడు అని వెల్ల‌డి
  • మంచి కథలు వస్తే తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తానన్న శివన్న 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (శివన్న) ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం సోమవారం బెంగళూరులో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, రామ్ చరణ్ నటనపై, సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పెద్ది' చిత్రంలో నటనకు గాను రామ్ చరణ్‌కు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

రామ్ చరణ్ నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. 
ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. "రామ్ చరణ్ ఎంతో కష్టపడి, నిజాయితీతో ఈ స్థాయికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, పవన్ కల్యాణ్, మెగా అభిమానుల ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయి. ఒక కార్యక్రమంలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పక్కపక్కనే కూర్చున్నప్పుడు వారి మధ్య ఉన్న ఆప్యాయత నన్ను ఎంతగానో కదిలించింది. ఆ బంధం నాకు, నా తమ్ముడు పునీత్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసింది. చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. 'పెద్ది' పాత్ర కోసం ఆయన పడిన కష్టం, ఆయన నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే" అని ప్రశంసించారు.

చిరంజీవి బర్త్ డేకి రక్తదానం చేశా: శివరాజ్ కుమార్ 
మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని కూడా శివన్న గుర్తుచేసుకున్నారు. "చిరంజీవి గారంటే మనందరికీ ఎంతో అభిమానం. ఆయన పుట్టినరోజున నిర్వహించిన రక్తదాన శిబిరంలో నేను కూడా పాల్గొని రక్తదానం చేశాను. చిరంజీవి కుటుంబాన్ని ప్రేక్షకులు ఎంతగానో ప్రేమిస్తారు. మంచి కళాకారులను భాషాభేదాలు లేకుండా ఆదరిస్తాం. 'పెద్ది'లో మంచి పాత్ర ఉందని చరణ్ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాను" అని తెలిపారు.

'పెద్ది' క్లైమాక్స్ థియేటర్లో సర్‌ప్రైజ్ చేస్తుంది: శివన్న 
సినిమాలోని తన పాత్ర గురించి వివరిస్తూ.. "'పెద్ది' ప్రయాణంలో ఎన్నో పాత్రలు వస్తుంటాయి, అందులో నాది ఒకటి. ఇందులో నాది గౌర్ నాయుడు అనే ఒక కోచ్ తరహా పాత్ర. పెద్ది, గౌర్ నాయుడు మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ అనుభూతిని థియేటర్లలోనే పొందాలి. ఈ పాత్ర ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోతుంది" అని అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు తన పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని, నిర్మాత సతీష్, కెమెరామెన్ రత్నవేలు తనకు ఎంతో ప్రేమ చూపించారని తెలిపారు. ప్రస్తుతం తాను 'గుమ్మడి నర్సయ్య', 'జైలర్ 2' చిత్రాల్లో నటిస్తున్నానని, మంచి కథలు వస్తే తప్పకుండా మరిన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తానని శివరాజ్ కుమార్ స్పష్టం చేశారు.
Go Back to Shorts
Shivarajkumar
Ram Charan
Peddi Movie
Buchi Babu Sana
Janhvi Kapoor
Telugu Cinema
National Award
Sports Action Drama
Gour Naidu
Mega Family

More Telugu News