చిన్నారి ప్రాణం కోసం బాలకృష్ణ విజ్ఞప్తి... రూ.16 కోట్లు అవసరం!

అరుదైన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారిని ఆదుకోవాలని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (టైప్ 2) వ్యాధితో బాధపడుతున్న బాలుడి చికిత్సకు రూ.16 కోట్లు అవసరమని, దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సాయం చేయాలని కోరారు.

వివరాల్లోకి వెళితే.. హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజ్ దంపతుల కుమారుడు కేయాన్స్ అడ్విక్ (2.5 సంవత్సరాలు) గత 21 నెలలుగా ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నాడు. బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి వైద్యులు ఈ వ్యాధిని నిర్ధారించారు. ఇటీవల హిందూపురం పర్యటనలో ఉన్న బాలకృష్ణను కలిసిన చిన్నారి కుటుంబ సభ్యులు, తమ బిడ్డ పరిస్థితిని వివరించి సహాయం కోసం అభ్యర్థించారు.

కేయాన్స్ ప్రాణాలు నిలబెట్టాలంటే AVXS-101 (ఒనసెమ్నోజీన్ అబెపార్వోవెక్) అనే జీవరక్షక ఇంజెక్షన్‌ను ఒక్కసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందు మన దేశంలో తయారు కాకపోవడంతో దీని ధర ఏకంగా రూ.16 కోట్లుగా ఉంది. ఇంత భారీ మొత్తాన్ని భరించే స్తోమత ఆ కుటుంబానికి లేదు.
ఈ విషయంపై స్పందించిన బాలకృష్ణ, తన వంతుగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రభుత్వపరంగా కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

"ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ వంతు సాయం చేసి ఆ చిన్నారి భవితకు బాటలు వేయాలి" అని ఆయన కోరారు. విరాళాలు అందించేందుకు వీలుగా ఆయన ఆ కుటుంబం బ్యాంకు ఖాతా వివరాలను (అకౌంట్: 8265662545, పేరు: A S నటరాజ్, IFSC: IDIB000J028, బ్రాంచ్: జేపీ నగర్) కూడా పంచుకున్నారు.

Nandamuri Balakrishna
Spinal Muscular Atrophy
SMA Type 2
Kiyansh Advik
AVXS-101
Gene Therapy
Hindupur
Lepakshi
Medical Fundraiser
Rare Disease

More Telugu News