ఏబీఎన్ ఆఫీసుపై దాడి ఘటన: అంబటి, జోగి సహా 19 మంది వైసీపీ నేతలపై కేసు

హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన పేరుతో దౌర్జన్యానికి దిగారన్న ఆరోపణలపై 19 మంది వైసీపీ కీలక నేతలపై కేసు నమోదైంది. ఈ నెల 7వ తేదీన జరిగిన ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పరిధిలోని ఫిలిం నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, నిరసన సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏబీఎన్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించి, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేశారు. "మీ అంతు చూస్తాం, ఆఫీసును పగలగొడతాం, మేము తలుచుకుంటే ఒక్కరు కూడా ఆఫీస్ నుంచి బయటకు వెళ్లలేరు" అంటూ తీవ్రంగా బెదిరించినట్లు పేర్కొన్నారు. ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు సంస్థ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించారని కూడా ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచారు.

ఈ నిరసన కార్యక్రమం వల్ల అపోలో ఆసుపత్రి సమీపంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీని కారణంగా అత్యవసర చికిత్స కోసం వెళ్తున్న మూడు అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి రోగులు ఇబ్బందులు పడ్డారని ఫిర్యాదులో తెలిపారు.

భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైన వారిలో అంబటి రాంబాబు, జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, లక్ష్మీ పార్వతి, మార్గాని భరత్, విశ్వరూప్, శంకర్ నారాయణ, శ్రీకాంత్ రెడ్డి, కారుమూరి వెంకట్ రెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు.
 

Ambati Rambabu
ABN Andhrajyothy
YSRCP Protest
Jogi Ramesh
Kakani Govardhan Reddy
Filmnagar Police
Andhra Pradesh Politics
Vemuri Radhakrishna
Traffic Disruption
Apollo Hospital

More Telugu News