ఇంటర్ ఫలితాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారా?: తెలంగాణ విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

ఇంటర్ ఫలితాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ విద్యా శాఖ ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఫలితాల ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని తెలిపింది.

ఇంతకుముందు ఎప్పుడూ ఏప్రిల్ మొదటి వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల కాలేదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత ఏడాది వరకు జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలైన తేదీలను కూడా పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది.

ఇంటర్ ఫలితాలు 2014లో మే 3న, 2015లో ఏప్రిల్ 22న, 2016లో ఏప్రిల్ 22న, 2017న ఏప్రిల్ 16న, 2018లో ఏప్రిల్ 13న, 2019లో ఏప్రిల్ 18న, 2021లో జూన్ 28న, 2022లో జూన్ 28న, 2023లో మే 4న, 2024లో ఏప్రిల్ 24న, 2025లో ఏప్రిల్ 22న విడుదలయ్యాయని పేర్కొంది.

సమాధాన పత్రాల మూల్యాంకనం, ఇతర అంశాల ఆధారంగా ఫలితాలను ప్రకటించే తేదీలు ప్రతి సంవత్సరం మారుతుంటాయనే విషయాన్ని గ్రహించాలని పేర్కొంది. మూల్యాంకనం పూర్తయ్యే సమయం ఆధారంగానే ఫలితాలను విడుదల చేస్తారని తెలిపింది. విద్యా శాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విద్యార్థులు, తల్లిదండ్రులు విశ్వసించాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరింది.

Telangana Education Department
Telangana Inter Results
TS Inter Results
Inter Results Date

More Telugu News