వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటును మార్చడం లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనూహ్య సవాళ్లు ఎదురవుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చమురు ధరల్లో పెరుగుదల ద్రవ్యోల్భణంపై ప్రభావం ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్భణం 4.6 శాతంగా ఉండవచ్చని తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ నాటికి ఆర్బీఐ వద్ద 696.1 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయని వెల్లడించారు.

కేంద్ర బ్యాంకు రెపో రేటును చివరిసారి గత సంవత్సరం డిసెంబర్‌లో సవరించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో నిర్వహించిన ద్వైమాసిక సమీక్షలో వడ్డీ రేటు యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ గత సంవత్సరం వడ్డీ రేట్లను పలుమార్లు సవరించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. జూన్ సమీక్షలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ, డిసెంబర్ నెలలో మరో పావు శాతం తగ్గించింది. దీంతో గత సంవత్సరం రెపో రేటు 1.25 శాతం మేర దిగి వచ్చింది.

Sanjay Malhotra
RBI
Reserve Bank of India
Repo Rate
Interest Rates
Monetary Policy
Inflation

More Telugu News