బీఆర్ఎస్ నేతలను నిర్బంధించడంపై కేటీఆర్ ఫైర్.. తమకు అరెస్టులు కొత్త కాదని వ్యాఖ్య!

పరిగి భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్టులు, గృహనిర్బంధాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఆయన 'పిరికిపంద చర్యలు'గా అభివర్ణించారు. పరిగి నియోజకవర్గంలో తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు మద్దతు తెలపడం నేరమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన అన్నారు.


రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం ద్వారా ప్రభుత్వం తన బలహీనతను బయటపెట్టుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. "అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్తేమీ కాదు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఇలాంటి ఎన్నో ఆంక్షలను ఎదుర్కొన్నాం. ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడతాం" అని స్పష్టం చేశారు.

పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల అనుమతి లేకుండా సాగిస్తున్న బలవంతపు భూసేకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. అక్రమంగా నిర్బంధించిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


KTR
BRS party
Telangana politics
Revanth Reddy government
Land acquisition
Harish Rao
Sabitha Indra Reddy
Parigi
Farmers protest
Vikrabad district

More Telugu News