ఆర్టిస్టులు అంటే నేరస్తులా?.. ట్రోలర్లపై రేణు దేశాయ్ ఆగ్రహం
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్‌పై నటి రేణు దేశాయ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన వ్యక్తిగత జీవితంపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న నెటిజన్లకు 'భావ ప్రకటన స్వేచ్ఛ' అంటే ఏమిటో వివరిస్తూ ఒక ఘాటు వీడియోను షేర్ చేశారు.
"మీ దృష్టిలో ఆర్టిస్టులు అంటే నేరస్తులా లేక ఉగ్రవాదులా? అంత దారుణమైన మాటలతో దూషించడానికి వారు చేసిన తప్పేంటి?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు. సెలబ్రిటీల అభిప్రాయాలు నచ్చకపోతే అన్‌ఫాలో చేయాలి తప్ప, నీచమైన పదజాలంతో దాడి చేయడం సంస్కారం కాదని హితవు పలికారు. చాలామంది బూతులు తిట్టడాన్ని 'భావ ప్రకటన స్వేచ్ఛ' అని పొరబడుతున్నారని, కానీ అది ముమ్మాటికీ వేధింపు కిందకే వస్తుందని ఆమె అన్నారు.
ప్రతి మనిషికి సమాజంలో గౌరవంగా బతికే హక్కు ఉందని, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయకూడదని రేణు అన్నారు. కష్టపడి పని చేస్తూ గౌరవంగా జీవించే కళాకారులను టార్గెట్ చేయడం మానుకోవాలని సూచించారు. ఇప్పటికే తనను దూషించిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, నెటిజన్లు తమ ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. సోషల్ మీడియాలో హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలని, అనవసరపు విమర్శలతో ఇతరుల మనోభావాలను దెబ్బతీయవద్దని ఆమె కోరారు.