Revanth Reddy: ‘నీ పో, మోనే విజయన్‌!’ అంటూ కేరళం సీఎంకు రేవంత్ కౌంటర్

సుస్థిరాభివృద్ధిలో తెలంగాణ ఆరో స్థానంలో ఉందంటూ కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘ఎక్స్’ వేదికగా చేసిన విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇది అసంబద్ధ పోలిక అని పేర్కొంటూ, వాస్తవ గణాంకాలతో కూడిన ఆరు పేజీల సుదీర్ఘ లేఖను సోమవారం విడుదల చేశారు. విజయన్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ, మలయాళంలోనే చురక అంటించారు.

విజయన్ తన ఆరోపణలకు వాడుకున్న గణాంకాలు 2023-24కి సంబంధించినవని, అవి తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చివరి దశలోనివని రేవంత్ గుర్తుచేశారు. కేరళంలో విజయన్ సర్కారు 120 నెలలుగా అధికారంలో ఉందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 28 నెలలే అయ్యిందని పేర్కొన్నారు. 70 ఏళ్ల కేరళ ప్రస్థానాన్ని తమ 28 నెలల పాలనతో పోల్చడం విజయన్ వంటి సీనియర్ నేత స్థాయికి తగదని హితవు పలికారు.

గత 60 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాల కృషి, గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న విదేశీ మారకద్రవ్యం వల్లే కేరళంలో పేదరికం తగ్గిందని, ఆ ఘనత కేవలం ఎల్డీఎఫ్ ప్రభుత్వానిది కాదని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లే కాగా, అందులో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, కేంద్రంలో బీజేపీ సృష్టించిన ఆర్థిక విధ్వంసం వల్లే రాష్ట్రంలో పేదరికం 5.88 శాతంగా నమోదైందని వివరించారు.

తాను ఏప్రిల్ 7న తిరువనంతపురం వచ్చి, తమ ప్రభుత్వ 28 నెలల విజయాలను వ్యక్తిగతంగా వివరిస్తానని రేవంత్ తెలిపారు. కేరళం ఎదుర్కొంటున్న మేధోవలసలు, పారిశ్రామిక స్తబ్దత వంటి సమస్యలను రేవంత్ ప్రస్తావించారు. “కేరళం ప్రజలు నాకు నేర్పిన మాటను ఇప్పుడు పూర్తి ఆప్యాయతతో మీకు చెబుతున్నాను.. నీ పో, మోనే విజయన్‌! (వెళ్లు అబ్బాయ్ విజయన్!)” అంటూ రేవంత్ తన లేఖను ముగించారు. 

Revanth Reddy
Pinarayi Vijayan
Kerala
Telangana
Sustainable Development
BRS Government
Congress
Economic Development
Poverty Reduction
Governance

More Telugu News