Natasa Stankovic: హార్దిక్ పాండ్యా తల్లితో కలిసున్న ఫొటోలను షేర్ చేసిన మాజీ భార్య నటాషా

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడిపోయినప్పటికీ, ఆయన కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని నటి, మోడల్ నటాషా స్టాంకోవిక్ కొనసాగిస్తున్నారు. తాజాగా ఆమె తన మాజీ అత్తగారింటికి వెళ్లి, వారితో గడిపిన క్షణాలను ఫోటోల రూపంలో పంచుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆదివారం రోజున నటాషా వడోదరలో పర్యటించారు. అక్కడ హార్దిక్ తల్లి, బామ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "బరోడా కేమ్ చో? (బరోడా ఎలా ఉన్నావు?)" అనే గుజరాతీ క్యాప్షన్‌ను ఈ ఫోటోలకు జోడించారు. ఈ పర్యటనలో ఆమె కుమారుడు అగస్త్య కూడా ఉన్నాడు.

కరోనా సమయంలో 2020లో హార్దిక్, నటాషా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. అయితే, 2024 జూలైలో తాము విడిపోతున్నట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించింది. తమ కుమారుడి భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసి బాధ్యతలు నిర్వర్తిస్తామని (కో-పేరెంటింగ్) అప్పట్లో హార్దిక్ ఓ ప్రకటనలో తెలిపారు.

విడాకుల తర్వాత కూడా వీరి మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోంది. ఇటీవల హార్దిక్ తన మాజీ భార్య, కుమారుడి కోసం సుమారు రూ.4 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం హార్దిక్ మరో అమ్మాయి మహీకా శర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తుండగా, నటాషా మాత్రం హార్దిక్ కుటుంబంతో ఇలా కనిపించడం ఆసక్తికరంగా మారింది. విడాకులు తీసుకున్నా కుటుంబ బంధాలకు విలువ ఇస్తున్నారంటూ నెటిజన్లు వీరిని ప్రశంసిస్తున్నారు.
Natasa Stankovic
Hardik Pandya
Natasa Hardik family
Divorce co-parenting
Agastya Pandya
Indian cricketer
Bollywood model
Vadodara visit
Mahika Sharma
Land Rover Defender

More Telugu News